మూడవ కాంప్లెక్స్‌పై ముందడుగు
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:54 AM
తిరుమలలో గంటల కొద్దీ క్యూలైన్‌లో నిరీక్షించే విధానానికి మంగళం పాడేలా టీటీడీ వైకుంఠం క్యూకాంప్లెక్స్-3 నిర్మాణంపై ముందడుగు వేసింది. వీలైనంత త్వరగా ఫీజిబులిటి రిపోర్టు కోసం ప్రత్యేక పరిశీలన కమిటీని నియమించింది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా త్వరలోనే నిర్మాణంపై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది.
మరో క్యూకాంప్లెక్స్ నిర్మాణంపై టీటీడీ పరిశీలన కమిటీ
తిరుమల, ఏప్రిల్14(ఆంధ్రజ్యోతి):తిరుమలలో గంటల కొద్దీ క్యూలైన్‌లో నిరీక్షించే విధానానికి మంగళం పాడేలా టీటీడీ వైకుంఠం క్యూకాంప్లెక్స్-3 నిర్మాణంపై ముందడుగు వేసింది. వీలైనంత త్వరగా ఫీజిబులిటి రిపోర్టు కోసం ప్రత్యేక పరిశీలన కమిటీని నియమించింది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా త్వరలోనే నిర్మాణంపై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. దాదాపు 20 వేల మంది భక్తులకు సరిపోయేలా కంపార్టుమెంట్లతో భవనాన్ని నిర్మించేలా గతేడాది టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేసిన విషయం తెలిసిందే.శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల కోసం ఇప్పటికే వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2 ఉన్న విషయం తెలిసిందే.అయితే ఈ రెండు కాంప్లెక్స్‌లు కూడా నిండిపోయి క్యూలైన్ బయటకు వ్యాపిస్తున్న క్రమంలో ఐదేళ్ల క్రితం నారాయణగిరి పార్క్‌లో తొమ్మిది షెడ్లను నిర్మించారు. ఇవి కూడా చాలక క్యూలైన్ కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం సర్కిల్, బాటగంగమ్మ ఆలయం, అక్టోపస్ భవనం మీదుగా కల్యాణవేదిక వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర క్యూలైన్ వ్యాపిస్తోంది. దీంతో క్యూలైన్లలో భక్తులు చిన్నపిల్లలు, వృద్ధులతో ఇబ్బంది పడుతున్నారు. వర్షం, ఎండ, చలికి ఆగచాట్లు పడుతుండడాన్ని గుర్తించిన అధికారులు శాశ్వత పరిష్కారంగా మరో క్యూకాంప్లెక్స్‌ను నిర్మించాలని నిర్ణయించారు. నిత్యం బయట క్యూలైన్లలో కనిపించే భక్తుల సంఖ్య 15 వేల నుంచి 20 వేల వరకు ఉంది. దీంతో దాదాపు 20 వేల మందికి సరిపోయేలా నూతన క్యూకాంప్లెక్స్ నిర్మించి అందులోని కంపార్టుమెంట్లలో భక్తులను కూర్చోబెట్టి అన్నపానీయాలు అందిస్తే కొంచమైనా ఉపశమనం లభిస్తుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అయితే గతంలో ఆర్బీ సెంటర్ వద్ద ఈ కాంప్లెక్స్‌ను నిర్మించాలని భావించినప్పటికీ ఇబ్బందులు తలెత్తే అవకాశాలుండడంతో ప్రస్తుత క్యూకాంప్లెక్స్‌లకు సమీపంలో ఉన్న నారాయణగిరిలోనే వీటి నిర్మాణం చేపట్టాలని టీటీడీ భావిస్తోంది. ఈక్రమంలోనే ఫీజిబులిటీ, ప్రాజెక్ట్ రిపోర్టు ఇవ్వాలని ప్రత్యేక కమిటీని నియమించారు.