ఇన్నాళ్లకు ముందడుగు!
ABN , Publish Date - May 07 , 2026 | 01:30 AM
నేతమ్స్ చక్కెర కర్మాగారానికి చెందిన చెరకు రైతుల బకాయిల విషయంలో కీలక ముందడుగు పడింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) పరిధిలో రైతుల క్లయిమ్‌ను అంగీకరించడంతో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది.
ఎన్‌సీఎల్‌టీ వద్ద రూ.64 కోట్ల క్లెయిమ్ ఆమోదం
‘నేతమ్స్’ చెరకు రైతులకు ఊరట
చిత్తూరు, మే 6 (ఆంధ్రజ్యోతి): నేతమ్స్ చక్కెర కర్మాగారానికి చెందిన చెరకు రైతుల బకాయిల విషయంలో కీలక ముందడుగు పడింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) పరిధిలో రైతుల క్లయిమ్‌ను అంగీకరించడంతో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. సుమారు 1650 మంది రైతులకు న్యాయం జరగనుంది.
నిండ్ర మండలంలోని నేతమ్స్ చక్కెర కర్మాగారానికి ఆరు మండలాలకు చెందిన సుమారు 8 వేల మంది రైతులు 2019-20 క్రషింగ్ సీజన్‌లో చెరకు సరఫరా చేశారు. వారిలో కొందరికి ఫ్యాక్టరీ బిల్లులు చెల్లించినా.. మూత పడే సమయానికి 1650 మంది రైతులకు రూ.35 కోట్ల మేర బకాయిలు చెల్లించలేదు. అప్పటి నుంచి రైతులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ఫలితం లేకుండా పోయింది. పలుమార్లు జిల్లా కేన్ కమిషనర్, కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేశారు. అధికారులు హామీలిస్తూనే ఉన్నారు. వైసీపీ హయాంలో స్థానిక మంత్రి రోజా, సీఎం జగన్‌ను కలిశారు. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, లోకేశ్ కూడా హామీలిచ్చారు.
ఫైనాన్స్ కంపెనీ రంగప్రవేశంతో రైతుల ఆగ్రహం
నేతమ్స్ కర్మాగారం ఫైనాన్స్‌లో ఉండడంతో నాలుగేళ్ల కిందట ముంబైకి చెందిన ఎస్‌టీసీఐ ఫైనాన్స్ కంపెనీ ముంబై కోర్టును ఆశ్రయించి రెవెన్యూ రికవరీ ప్రక్రియపై స్టే పొందింది. దీంతో రైతులు ఆగ్రహించారు. సుమారు రెండు మూడు రోజుల పాటు అటు రైతులతో.. ఇటు ఫైనాన్స్ కంపెనీతో.. జిల్లా అధికారులు సమావేశమై చర్చలు జరిపారు. ఫ్యాక్టరీ విక్రయించాక వచ్చిన మొత్తాన్ని పంచుకోవాలని నిర్ణయించారు. రైతుల బకాయిలు, కార్మికుల జీతాలు చెల్లించాక.. ఫైనాన్స్ వారు తమ బకాయిని తీసుకోవాలని పోలీసుల ద్వారా ఒప్పించారు. అయితే, కొనుగోలుదారులు తక్కువ ధర ప్రతిపాదించడంతో విక్రయ ప్రక్రియ ముందుకు సాగలేదు.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌తో కొలిక్కి..
ఎస్‌టీసీఐ ఫైనాన్స్ సంస్థ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, ఈ ఏడాది ఫిబ్రవరి 10న ట్రిబ్యునల్ రిసల్యూషన్ ప్రొఫెషనల్‌ను నియమించింది. కలెక్టర్ సుమిత్‌కుమార్, రైతు సంఘ నాయకులతో కలిసి రైతుల బకాయిలకు సంబంధించిన క్లెయిమ్‌లను రిసల్యూషన్ ప్రొఫెషనల్‌కు సమర్పించారు. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ బకాయిల చెల్లింపులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అసలు రూ.34 కోట్లు.. వడ్డీ రూ.30 కోట్లు
దీంతో 1650 మంది రైతులకు సంబంధించిన అసలు రూ.34 కోట్లు, వడ్డీ రూ.30 కోట్లు మొత్తంగా రూ.64 కోట్ల క్లెయిమ్‌ను బకాయిగా పరిగణిస్తూ అంగీకరించినట్లు రిసల్యూషన్ ప్రొఫెషనల్ ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్‌సీఎల్‌టీ వద్ద రైతుల తరపున పోరాటం కొనసాగిస్తున్నామని, బకాయిల వసూళ్ల కోసం అన్నివిధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు.