Share News

చిన్న ఇనుప రాడ్డు నిందితుడిని పట్టిచ్చింది!

ABN , Publish Date - Apr 12 , 2026 | 01:07 AM

హిట్‌ అండ్‌ రన్‌ కేసు దర్యాప్తులో చిన్న ఇనుప రాడ్డు ప్రమాదానికి కారణమైన లారీని పట్టిచ్చింది. గూగుల్‌ టేకవుట్‌ సాయంతో రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన లారీని సీజ్‌ చేయడంతో పాటు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

చిన్న ఇనుప రాడ్డు నిందితుడిని పట్టిచ్చింది!
ఘటనాస్థలంలో దొరికిన ఇనుప రాడ్డు

-గూగుల్‌ టేకవుట్‌ సాయంతో హిట్‌ అండ్‌ రన్‌ కేసు ఛేదన

చంద్రగిరి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): హిట్‌ అండ్‌ రన్‌ కేసు దర్యాప్తులో చిన్న ఇనుప రాడ్డు ప్రమాదానికి కారణమైన లారీని పట్టిచ్చింది. గూగుల్‌ టేకవుట్‌ సాయంతో రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన లారీని సీజ్‌ చేయడంతో పాటు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 13వ తేదిన చంద్రగిరి మండలంలోని రాయలపురానికి చెందిన మాతయ్య, చంద్ర, నాగరాజు, హరి తిరుపతిలో కూలి పనులు ముగించుకొని ఆటోలో ఇంటికి బయలుదేరారు. తొండవాడ ఫ్లైవోవర్‌పై ఆటోను వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొంది. దీంతో ఆటో పల్టీలు కొట్టి బోల్తా పడింది. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లిపోయింది.ఆటోలో ప్రయాణిస్తున్న మాతయ్య, చంద్ర, నాగరాజు, హరి తీవ్రంగా గాయపడ్డారు.వీరిలో చికిత్స పొందుతూ చంద్ర మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తులో భాగంగా ప్రమాద స్థలాన్ని పరిశీలించగా, చిన్న ఇనుప రాడ్డు దొరికింది. దాని ఆధారంగా గాదంకి టోల్‌ఫ్లాజా వద్ద సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి, ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించారు. లారీ నెంబర్‌ ఆధారంగా యజమాని ఫోన్‌ నెంబర్‌ కనుగొన్నారు. అయితే లారీ రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందింది కావడంతో యజమాని సీడీ ఆర్సీ తీయగా అందులో సుమారు వందకుపైగా ఫోన్‌ నెంబర్లు నమోదై ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో డ్రైవర్‌ నెంబర్‌ తెలుసుకుని గూగుల్‌ టేకవుట్‌ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్‌ లోకేష్‌ ఇక్కడే ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. అతడి లొకేషన్‌పై నిఘా పెట్టగా రెండు రోజుల క్రితం మైదుకూరు దగ్గర చూపించడంతో పోలీసులు లారీని సీజ్‌ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.లారీని పట్టుకోవడంతో మృతుడి కుటుంబానికి బీమా సొమ్ము అంది న్యాయం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - Apr 12 , 2026 | 01:07 AM