టీటీడీ ఉద్యోగులకు వరాల జల్లు
ABN , Publish Date - May 07 , 2026 | 01:34 AM
టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులకు టీటీడీ ధర్మకర్తల మండలి వరాలజల్లు కురిపించింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో చైర్మన్ బీఆర్ నాయుడు, సభ్యులు టీటీడీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అనుకూలంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఉద్యోగులందరీ శ్రీవారి దర్శనం, లడ్డూ కార్డ్
తిరుమల, మే6(ఆంధ్రజ్యోతి): టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులకు టీటీడీ ధర్మకర్తల మండలి వరాలజల్లు కురిపించింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో చైర్మన్ బీఆర్ నాయుడు, సభ్యులు టీటీడీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అనుకూలంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ గుర్తింపుకార్డులు జారీ చేసి శ్రీవారి దర్శనంతో పాటు లడ్డూ కార్డులు జారీ చేయాలని బోర్డు నిర్ణయించారు. అలాగే టీటీడీ ఉద్యోగులకు హెల్త్ స్కీంలో భాగంగా ప్రస్తుతమున్న రూ.3 లక్షలకు అదనంగా మరో రూ.2 లక్షలను రీయింబర్స్‌మెంట్ చేసేందుకు ఆమోదం తెలిపారు. గతంలో పెండింగ్‌లో ఉన్న రూ.13 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ను క్లియర్ చేయాలని తీర్మానించారు. అలాగే గతంలో శాశ్వత ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను రెండుమూడేళ్లుగా పట్టించుకోకపోవడంతో తాజా బోర్డు సమావేశంలో చర్చించారు. ఆ స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం బోర్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పనులు ప్రారంభిస్తామని చైర్మన్ ప్రకటించారు. అలాగే స్విమ్స్ కార్మికులు, శ్రీవారిమెట్టు వ్యాపారుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. స్విమ్స్‌లోని మెడికల్ దుకాణాలన్నీ టెండర్ ప్రాదిపదికన కేటాయిస్తామని చెప్పారు. ఇక, టీటీడీ శ్రవణం ప్రాజెక్ట్‌లో శిక్షణ పొందుతున్న వినికిడి లోపం ఉన్న 150 మంది పిల్లలకు ఉచితంగా వినికిడి యంత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.