ఎన్నికల వేళ వైసీపీకి షాక్
ABN , Publish Date - Oct 29 , 2026 | 01:24 AM
స్థానిక సంస్థల ఎన్నికల వేళ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి షాక్ ఇచ్చారు వైసీపీ నేత చిలమంద మునికృష్ణ. వారం రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపధ్యంలో బుధవారం ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
పార్టీకి తిరుపతి రూరల్ మాజీ ఎంపీపీ రాజీనామా
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల వేళ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి షాక్ ఇచ్చారు వైసీపీ నేత చిలమంద మునికృష్ణ. వారం రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపధ్యంలో బుధవారం ఆయన పార్టీకి రాజీనామా చేశారు.ఉమ్మడి శెట్టిపల్లె పంచాయతీ సర్పంచ్‌గా, తిరుపతి రూరల్ ఎంపీపీగా పనిచేసిన మునికృష్ణకు తిరుపతి అర్బన్ మండలంలోని మంగళం, శెట్టిపల్లె(న్యూమంగళం), సప్తగిరి కాలనీ, తిరుమల నగర్, రణధీర్‌పురం ప్రాదేశిక నియోజకవర్గాలతో పాటు మండలపరిధిలోని పలు ప్రాదేశిక నియోజకవర్గాల్లో రాజకీయంగా మంచి పట్టు, ప్రజామద్దతు వున్నాయి. ఇటీవల పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ రావడంతో క్రమేపీ ఆయనకూ మాజీ ఎమ్మెల్యేకి మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది.గత ఎన్నికల్లో అవసరార్ధం ముఖ్యనేతలు మునికృష్ణను బుజ్జగించి దగ్గరకు చేర్చుకోవడంతో ఆయన మళ్ళీ చురుగ్గా పనిచేశారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన మునికృష్ణ వైసీపీకి రాజీనామా చేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడికి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యేకి లేఖ రాశారు.పార్టీని నమ్ముకుని ఎంతో కష్టపడి పనిచేశానని, అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఇప్పటి వరకూ తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్న ఆయన తక్షణం తన రాజీనామాను ఆమోదించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు.