Share News

నలగాంపల్లెలో ‘పంచాయితీ’

ABN , Publish Date - Nov 21 , 2026 | 02:11 AM

బంగారుపాళ్యం మండలం నలగాంపల్లెలోని నామినేషన్ల కేంద్రం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం టీడీపీ, వైసీపీ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు. రెండో విడతలో నలగాంపల్లె పంచాయతీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఏకగ్రీవం చేసుకోవడానికి టీడీపీ నేతలు అందరినీ ఒప్పించే ప్రయత్నం చేశారు. దీనికి వైసీపీ వారు అంగీకరించలేదు.

నలగాంపల్లెలో ‘పంచాయితీ’

టీడీపీ, వైసీపీ నేతల బాహాబాహీ

రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలు

బంగారుపాళ్యం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): బంగారుపాళ్యం మండలం నలగాంపల్లెలోని నామినేషన్ల కేంద్రం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం టీడీపీ, వైసీపీ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు. రెండో విడతలో నలగాంపల్లె పంచాయతీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఏకగ్రీవం చేసుకోవడానికి టీడీపీ నేతలు అందరినీ ఒప్పించే ప్రయత్నం చేశారు. దీనికి వైసీపీ వారు అంగీకరించలేదు. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు. దీంతో సర్పంచి, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులతో పాటు వైసీపీ నేతలు వస్తుండగా.. బస్టాపు వద్ద కొందరు టీడీపీ సానుభూతిపరులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు, బీరు బాటిళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ గొడవలు నామినేషన్‌ కేంద్రానికి దగ్గరగా ఉన్న హైవేపై జరగడాన్ని గమనించిన పోలీసులు.. అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణల్లో తెలుగు యువత మండల అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, లోకనాథం, పునీత్‌, పురుషోత్తం, తేజ.. నలగాంపల్లె గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారులు హేమంత్‌ కుమార్‌, మేఘనాథ్‌ గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ బాలసుబ్రమణ్యంను వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రికి ఇరువర్గాల మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో.. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలమనేరు డీఎస్పీ ప్రభాకర్‌ ఆసుపత్రికి వచ్చి బాధితులతో మాట్లాడారు. ఘర్షణ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎవరైనా నామినేషన్‌ వేయాలంటే తమ వాహనాల్లో తీసుకెళ్తామని డీఎస్పీ వారికి చెప్పారు. కాగా, గొడవలు సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే వైసీపీ వర్గీయులు తమ కారులో రాళ్లు, కర్రలు, బీరు సీసాలు తీసుకొచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. అద్దాలు ధ్వంసమైన కారులో ఉన్న రాళ్లు, కర్రల ఫొటోలను వీరు విడుదల చేశారు.

Updated Date - Nov 21 , 2026 | 02:11 AM