Share News

చిత్తూరు శివారు చెరువులో జంట ఏనుగుల జలకాలాట

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:02 AM

చిత్తూరుకు జంట ఏనుగులు వచ్చాయి. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సంతపేటలోని బుడమలచెరువు సమీప కాలనీ ఇళ్ల వద్దకు చేరాయి.

చిత్తూరు శివారు చెరువులో జంట ఏనుగుల జలకాలాట
బుడమాల చెరువులో ఏనుగులు

చిత్తూరు సెంట్రల్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): చిత్తూరుకు జంట ఏనుగులు వచ్చాయి. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సంతపేటలోని బుడమలచెరువు సమీప కాలనీ ఇళ్ల వద్దకు చేరాయి. అలికిడితో స్థానికులు బయటకు వచ్చి చూడగా ఏనుగులు కనిపించాయి. వీరిచ్చిన సమాచారంతో అటవీశాఖ ఎఫ్‌బీవో రెడ్డప్ప, ఏబీవో ఉదయ్‌ కుమార్‌ కేవలం ఇద్దరు మాత్రమే ఉదయం 5.30 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను చెదరగొట్టే క్రమంలో చెరువువైపుగా వెళ్లడానికి నిల్చున్న జంట ఏనుగుల్లో ఒకటి ఎఫ్‌బీవోపై దాడికి యత్నంచింది. పరిస్థితిని గమనించిన ఆయన చాకచక్యంగా తప్పించుకున్నారు. తమిళనాడు నుంచి వెదురుకుప్పానికి వచ్చిన జంట ఏనుగులే ఇవని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రి ఎస్‌ఆర్‌ పురం మండలం నుంచి బయలుదేరి శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లె సమీపంలోని పొలాల్లోకి చేరాయి. అక్కడి నుంచి సీఆర్‌ కండ్రిగ మీదుగా శనివారం ఉదయానికి పూతలపట్టు మండలం ఆర్‌వీఎస్‌ కళాశాలకు చేరుకున్నాయి. గొల్లపల్లె గ్రామానికి చెందిన వెంకటేశు అనే రైతుకు సంబంధించిన 9.. లంకిపల్లెకు చెందిన శశినాయుడువి 4 చొప్పున రాతికూసాలు ధ్వంసం చేశాయి. రోజంతా ఆర్‌వీఎస్‌ కళాశాల ప్రాంతాల్లోని అడవుల్లోనే ఉండిపోయాయి. శనివారం అర్ధరాత్రి బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కాణిపాకం రోడ్డు మీదుగా బ్యాన్స్‌ ది హోటల్‌ వద్దకు చేరుకున్నాయి. అటు వైపుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. భారీ వాహనాలు రావడంతో చిత్తూరు శివారు మంగసముద్రం హరిజనవాడకు చేరుకున్నాయి. అక్కడ్నుంచి రామచంద్రామిషన్‌ వద్దకు రాగా.. దారి సరిగ్గా లేకపోవడంతో ఇంద్రానగర్‌లోని ఓ ఇంటి ప్రహరీ కూల్చేసి, తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో దొంగలబావి వీధి సమీపంలోని బుడమలచెరవు సమీప నివాసాల వద్దకు వెళ్లాయి. ఆ తర్వాత బుడమలచెరువులోకి దిగి సేదతీరాయి. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఏనుగులు ఇక్కడి వచ్చాయని స్థానికులు అంటున్నారు.

అధికారులేం చేశారంటే?

చెరువులో ఉన్న జంట ఏనుగులను చూసేందుకు స్థానికులు అటువైపు వెళ్లకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. అక్కడి పరిస్థితిపై ఆరాతీసి, స్థానికులకు ధైర్యం చెప్పి డీఎ్‌ఫవో సుబ్బరాజు వెళ్లిపోయారు. ఈస్టు, వెస్టు ఎఫ్‌ఆర్వోలు థామస్‌ సుకుమార్‌, పట్టాభి, అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో స్థానికుల్ని అదుపు చేసే యత్నం చేశారు. చెరువులోని విద్యుత్తు స్తంభాల గుండా సరఫరా వెళుతుండటంతో ఏనుగులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా డిస్కం అధికారులు కరెంటు ఆపేశారు. కొంతసేపు బాణసంచా పేల్చి.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారు. ట్రాకర్ల సాయంతో ఏనుగులను అటవీ ప్రాంతంలోకి దారి మళ్లించే యత్నం చేయకపోవడంపై విమర్శలొచ్చాయి.

చీకటి పడ్డాక ఎలిఫెంట్‌ డ్రైవ్‌

సాయంత్రం అయ్యాక డీఎఫ్వో సుబ్బరాజు పర్యవేక్షణలో ఎలిఫెంట్‌ డ్రైవ్‌ చేపట్టారు. చిత్తూరు ఈస్టు, వెస్టు ఎఫ్‌ఆర్వోలు, ఎఫ్‌బీవోలు, ఏబీవో, పలమనేరు నుంచి 13 మంది ట్రాకర్లు.. మొత్తం 40 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. సంతపేట నుంచి ఆర్‌వీఎస్‌ వరకు విద్యుత్‌ సరఫరా ఆపేశారు. డ్రైవ్‌లో భాగంగా మురకంబట్టు సమీపంలోకి వెళ్లిన జంట ఏనుగులు.. వాహనాలను చూసి వెనుదిరిగే ప్రయత్నం చేశాయి. దీంతో అధికారులు బాణసంచా పేల్చారు. దీంతో లెనిన్‌నగర్‌, సీటమ్స్‌ కళాశాల వద్దనున్న గుట్ట మీదుగా అటవీ ప్రాంతంలోకి పంపారు. అటు నుంచి మరింత లోపలి వైపు అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు.

Updated Date - Feb 09 , 2026 | 02:02 AM