Share News

కుప్పం రైతులకు వన్‌టైమ్‌ జాక్‌పాట్‌!

ABN , Publish Date - Aug 08 , 2026 | 01:39 AM

143 మంది అధీనంలోని 178 ఎకరాలకు రూ.12.44 లక్షల చొప్పున పరిహారం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు

కుప్పం రైతులకు వన్‌టైమ్‌ జాక్‌పాట్‌!

చిత్తూరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): వారసత్వ హక్కులు, డీకేటీ పట్టాల్లాంటి రికార్డులు లేకుండా, దశాబ్దాల తరబడి తమ అనుభవంలో సాగు చేసుకుంటున్న కుప్పం నియోజకవర్గంలోని 143 మంది రైతులకు వన్‌టైమ్‌ జాక్‌పాట్‌ దక్కింది. ఈ కోవకు చెందిన 178.32 ఎకరాల భూములకు.. రూ.12.44 లక్షల వంతున పరిహారం చెల్లించి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కోసం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో.. రామకుప్పం మండలంలోని కిలకిపోడులో 44 మంది రైతుల అధీనంలోని 46.74 ఎకరాలు, కడసినకుప్పంలో 20 మంది స్వాధీనంలోని 10.78 ఎకరాలు, మణేంద్రంలోని 33 మందికి చెందిన 48.11 ఎకరాలు, బొందలగుంటలో ఐదుగురు రైతుల అనుభవంలోని 3.37 ఎకరాలు, శాంతిపురం మండలంలోని సొన్నెగానిపల్లెలో మరో ఐదుగురికి సంబంధించిన 10.32 ఎకరాలు, దండికుప్పంలో ఏడుగురు రైతుల సాగులోని 7.76 ఎకరాలు, అమ్మవారిపేటలో 29 మంది అనుభవంలోని 51.23 ఎకరాలున్నాయి. రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు ఇది వరకే 1405 ఎకరాల భూసేకరణకు కలెక్టరు విడిగా నోటిఫికేషన్‌ జారీ చేశారు. అదనపు భూములు అవసరం కాగా డీకేటీ పట్టాలు, ఇతర రికార్డుల్లేకుండా ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న రైతులకు పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోవడానికి కలెక్టరు సుమిత్‌కుమార్‌ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గయ్యాలు, గుట్ట పొరంబోకు భూములకు ఎలాంటి పట్టాలు లేకపోయినా రైతులు పెద్ద మొత్తంలో ఖర్చుచేసి సాగులోకి తెచ్చుకున్నారని తన ప్రతిపాదనల్లో కలెక్టర్‌ పేర్కొన్నారు. కేవలం వర్షాధార పంటలతో సాగు చేస్తున్నారని వివరించారు. ఈ భూములకు పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలూ లేవని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం.. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనువుగా స్పందించింది. డీకేటీ పట్టాలు లేకున్నా పరిహారం చెల్లించాలని, ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌గా పరిగణించి భవిషత్తులో దీని ఆధారంగా పరిహారం కోసం ఎవరూ డిమాండు చేయరాదనే నిబంధనలతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి హోదాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

13.47 ఎకరాల్లో చుడా లేఅవుట్‌

చిత్తూరు రూరల్‌ మండలంలోని తిమ్మసముద్రం గ్రామంలో 13.47 ఎకరాల ప్రభుత్వ భూమిని చుడా లేఅవుట్‌ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించింది. ఎకరాకు రూ.62,71,870 చొప్పున మొత్తం రూ.8.44 కోట్లను చుడా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను ఏపీ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ పరిశీలించి సిఫార్సు చేశాక ప్రభుత్వం ఆమోదించింది. మూడేళ్లలో భూమిని ఉపయోగించాలని, ఇందులోని నీటి వనరుల్ని దెబ్బ తీయొద్దని, ఇప్పటికే ఉన్న రోడ్లు, రాస్తాలను తొలగించొద్దని సూచించింది.

Updated Date - Aug 08 , 2026 | 01:39 AM