Share News

గండికోట ఫేజ్‌-2 పనులకు కొత్త రూపు

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:51 AM

ఉమ్మడి జిల్లాలోని తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గండికోట నుంచి నీళ్లను తెస్తోంది. ఇప్పటికే రూ.2370 కోట్లతో ఫేజ్‌-1 పనులు పురోగతిలో ఉండగా, ఆ మధ్య రూ.1886 కోట్లతో ఫేజ్‌-2 పనుల కోసం టెండర్లను ఆహ్వానించారు.

గండికోట ఫేజ్‌-2 పనులకు కొత్త రూపు
గండికోట రిజర్వాయరు వద్ద పనులను పరిశీలిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు (ఫైల్‌ ఫొటో)

మదనపల్లెకు రూ.వెయ్యి కోట్లు

పుంగనూరు, పలమనేరు, కుప్పం, చంద్రగిరికి రూ.1886 కోట్లు

గతంలో ఒకే ప్రాజెక్టుగా టెండర్ల ఆహ్వానం.. రద్దు

ఆగస్టులో మళ్లీ కొత్తగా టెండర్లు

ఇప్పటికే రూ.2370 కోట్లతో పురోగతిలో ఫేజ్‌-1 పనులు

గండికోట నుంచి ఉమ్మడి జిల్లాకు నీరు

చిత్తూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గండికోట నుంచి నీళ్లను తెస్తోంది. ఇప్పటికే రూ.2370 కోట్లతో ఫేజ్‌-1 పనులు పురోగతిలో ఉండగా, ఆ మధ్య రూ.1886 కోట్లతో ఫేజ్‌-2 పనుల కోసం టెండర్లను ఆహ్వానించారు. తాజాగా ఆ టెండర్లను రద్దు చేసి.. పనుల వేగవంతానికి ఫేజ్‌-2 పనుల్ని రెండుగా విభజించారు. రూ.వెయ్యి కోట్లతో ఓ ప్రాజెక్టు, రూ.1886 కోట్లతో మరో ప్రాజెక్టును సిద్ధం చేసి మరోసారి టెండర్లను పిలవనున్నారు.

రెండు ప్రాజెక్టులుగా..

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు.. చిత్తూరులోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో పూర్తిగా.. చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఫేజ్‌-2ను రూపొందించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.2886 కోట్లతో జూన్‌లో టెండర్లను ఆహ్వానించింది. ఈ భారీ ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని, ప్రభుత్వం తాజాగా రెండు ప్రాజెక్టులుగా విభజించింది. కేవలం మదనపల్లె నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్లు.. మిగిలిన పుంగనూరు, పలమనేరు, కుప్పం, చంద్రగిరి (2 మండలాలు)లకు రూ.1886 కోట్లుగా మార్చింది. ఈ ప్రాజెక్టులకు ఆగస్టు 4 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానిస్తోంది.

పురోగతిలో ఫేజ్‌-1 ప్రాజెక్టు

అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు, ఆయా ప్రాంతాల్లోని సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గండికోట ఫేజ్‌-1 పనుల్ని డిజైన్‌ చేశారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.2370 కోట్ల నిధుల్ని కేటాయించగా, గతేడాది ఏప్రిల్‌లో పనులు ప్రారంభమయ్యాయి. 2027 అక్టోబరు నాటికి పూర్తి కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.వంద కోట్లకుపైగా పనులు పూర్తయ్యాయి.

ప్రాజెక్టు స్వరూపం

‘చిత్తూరు జిల్లాలో పశ్చిమ ప్రాంతాలకు తాగునీటి సరఫరా పథకం’ పేరుతో దీన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కడప జిల్లాలోని గండికోట వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నిర్మించి అక్కడి నుంచి జిల్లాకు నీళ్లను తెస్తుంది. పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ మండలంలో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను నిర్మిస్తారు. అక్కడ నీటి శుద్ధి చేసి ఆయా ప్రాంతాలకు పంపిస్తారు.

2028 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం

జల్‌జీవన్‌ మిషన్‌ 2.0 మార్గదర్శకాల ప్రకారం అన్ని మల్టీ విలేజ్‌ స్కీమ్స్‌ను 2028 జూన్‌ నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అదే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసి ముందుకెళుతోంది. పనుల్ని వెంటనే చేపట్టి, అవసరమైన నిధుల్ని జల్‌జీవన్‌ మిషన్‌ లేదా ఇతర గ్రాంట్ల నుంచి సమీకరించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అదికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jul 30 , 2026 | 12:51 AM