నయా మోసం
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:29 AM
ట్రెడిషనల్.. సైబర్ క్రైం. సెల్‌ఫోనును దొంగిలించి.. ఆ యజమాని ఫోను చేశాక వివరాలు తెలుసుకుని.. అదే ఫోనులోని యూపీఐ ద్వారా ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలోని నగదును మాయం చేయడం.. ఇప్పుడు ఈ కొత్త తరహా మోసం జరుగుతోంది. సెల్‌ఫోనును దొంగిలించిన.. ఆ తర్వాత సైబర్ నేరాలకు పాల్పడే ముఠాను ఇటీవల హైదరాబాదు పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడా ఇలాంటి మోసాలకు దొరక్కుండా అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.
ట్రెడిషనల్.. సైబర్ క్రైం
అమాయకులే లక్ష్యం
మొబైల్ ఫోన్లను దొంగలించి.. ఆపై నమ్మించి మోసం
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
ట్రెడిషనల్.. సైబర్ క్రైం. సెల్‌ఫోనును దొంగిలించి.. ఆ యజమాని ఫోను చేశాక వివరాలు తెలుసుకుని.. అదే ఫోనులోని యూపీఐ ద్వారా ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలోని నగదును మాయం చేయడం.. ఇప్పుడు ఈ కొత్త తరహా మోసం జరుగుతోంది. సెల్‌ఫోనును దొంగిలించిన.. ఆ తర్వాత సైబర్ నేరాలకు పాల్పడే ముఠాను ఇటీవల హైదరాబాదు పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడా ఇలాంటి మోసాలకు దొరక్కుండా అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.
- చిత్తూరు అర్బన్, ఆంధ్రజ్యోతి
సైబర్ నేరగాళ్లు కొందరితో బృందాలను ఏర్పాటు చేసుకుంటారు. వారిని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, ఇతర జనసమ్మర్థంగా ఉన్న ప్రాంతాలకు పంపిస్తారు. వీరు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని.. నిఘా పెడతారు. అలాంటి వారు కాసింత ఏమరుపాటుగా ఉంటే చాలు.. వారి మొబైల్ ఫోన్లను దొంగలిస్తారు. సాధారణంగా జరిగే ఇలాంటి ట్రెడిషనల్ దొంగతనాల్లో.. వెంటనే సెల్‌ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసేస్తుంటారు. సిమ్ తీసేస్తారు. ఇక్కడేమో దొంగిలించిన సెల్‌ఫోన్లను వీరు సైబర్ నేరగాళ్లకు ఇస్తారు. వాళ్లు ఆ ఫోనును స్విచ్ ఆన్ చేస్తారు. ఇంతలో సెల్‌ఫోన పోగొట్టుకున్నవారు.. మరొకరి ఫోను నుంచి తమ ఫోనుకు ఆత్రుతగా ఫోను చేస్తారు. అటు పక్కన సైబర్ నేరగాళ్లు ఆ ఫోనును దొంగిలించిన ప్రాంతాన్ని బట్టి ఆర్టీసీ కండక్టరనో.. రైల్వే ఉద్యోగిగానో పరిచయం చేసుకుంటారు. ఈ ఫోను తమ వద్దే ఉందని చెప్పి కట్ చేస్తారు. ఎలాగైనా ఫోను తీసుకోవాలనే తొందర్లో ఆ యజమాని ఉంటారు.
ఈ ఫోను మీదే అనడానికి నిదర్శనమేమి?
కొంతసేపటి తర్వాత.. ఆ నెంబరుకు సైబర్ నేరగాళ్ల ముఠాలోని వ్యక్తి ఫోను చేస్తాడు. చాలామంది ఫోనుచేసి ఈ ఫోను వారిదంటున్నారు. అలాంటప్పుడు నిజంగా ఈ ఫోన్ ఎవరిదని తేల్చాలంటూ ప్రశ్నిస్తాడు. దాంతో గాబారా పడి ఆ ఫోను తమదేనని, కావాలంటే పాస్‌వర్డు లేదా ప్యాట్రన్ చెబుతాం.. చెక్ చేయండంటారు. అలా వాళ్లు చెప్పే దాన్నిబట్టి సైబర్ ముఠాలోని వ్యక్తి ఆ ఫోనును ఓపెన్ చేసి గ్యాలరీలో ఉన్న ఫొటోలు, వాట్స్‌పలో చాటింగ్ వివరాలను సేకరిస్తాడు. మరికొంత సేపటికి ఆ ఫోను తనదేనంటూ.. ఫోను పోగొట్టుకున్న బాధితుడినే బెదిరిస్తాడు.
అకౌంట్‌లోని డబ్బులను మళ్లిస్తారు
ఇలా అన్ని వివరాలను తెలుసుకున్న తర్వాత యూపీఐ లావాదేవీలకు సంబంధించి పిన్ నెంబరును (ఫర్‌గాట్ పిన్ నెంబరు) మార్చుకుంటాడు. వారి ఖాతాలోని డబ్బులను ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తాడు. బెట్టింగ్.. గేమింగ్ యాప్‌లకు మళ్లించి, ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి పంపిస్తాడు.
బెదిరింపులు కూడా..
ఒక్కోసారి ఫోన్లను పోగొట్టుకున్న వారిని బ్యాంకు అకౌంట్, యూపీఐ పిన్ నెంబర్లను సైబర్ ముఠా అడుగుతుంది. వాళ్లు చెప్పకపోతే... అంతకుముందే ఆ ఫోనులో నుంచి తాము సేకరించిన ఫొటోలు, వాట్సప్ చాటింగ్‌లలో రహస్యమైనవి.. ప్రైవేటు వ్యవహారాలుంటే బయట పెడతామని బెదిరిస్తారు. దాంతో కొంత మంది భయపడి సైబర్ నేరగాళ్లకు అన్ని వివరాలను చెప్పే అవకాశం ఉంది.
మొబైల్ పోతే సిమ్‌ను బ్లాక్ చేయించాలి
ఎవరిదైనా సెల్‌ఫోను దారపోయినా లేదా దొంగలు ఎత్తుకెళ్లినా వెంటనే ఆయా నెట్‌వర్క్ నిర్వాహకులను సంప్రదించి సిమ్‌ను బ్లాక్ చేయించాలి. ఎవరైనా ఫోన్ దొరికిందని చెప్పి పాస్‌వర్డ్, పిన్ నెంబర్లు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు. సమీపంలోని పోలీసు స్టేషన్‌లో ఆ ఫోను ఇవ్వండని వారికి చెప్పాలి. బాధితులు వెంటనే ఎక్కడైతే ఫోన్ పోయిందో అక్కడి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఆ మొబైల్ ఎక్కడుందో పోలీసులు కనుక్కుంటారు. ఒక వేళ సిమ్‌ను మార్చి వేరేది వేసినా పోలీసులు పట్టుకుంటారు.
- నిత్యబాబు, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా ఇన్‌స్పెక్టర్