కొడుకును కాపాడబోయి తల్లి
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:36 AM
తన కళ్లెదుటే ప్రమాదవశాత్తు నీటికుంటలో పడిన కొడుకు. తల్లి ప్రాణం విలవిలలాడింది. తనకు ఈత రాదనే విషయం గుర్తురాలేదామెకు. కొడుకును కాపాడాలనే తపనతో తానూ నీటికుంటలో దిగింది. ఈత రాక మునిగిపోవడంతో తల్లీ కొడుకులూ అసువులు బాశారు.
నీటికుంటలో పడి దుర్మరణం
నెలవాయిలో తీవ్ర విషాదం
శ్రీరంగరాజపురం, జూన్ 14(ఆంధ్రజ్యోతి): తన కళ్లెదుటే ప్రమాదవశాత్తు నీటికుంటలో పడిన కొడుకు. తల్లి ప్రాణం విలవిలలాడింది. తనకు ఈత రాదనే విషయం గుర్తురాలేదామెకు. కొడుకును కాపాడాలనే తపనతో తానూ నీటికుంటలో దిగింది. ఈత రాక మునిగిపోవడంతో తల్లీ కొడుకులూ అసువులు బాశారు. ఈ విషాద ఘటన శ్రీరంగరాజపురం మండలం నెలవాయి సమీపంలోని పొలాల్లో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. నెలవాయికి చెందిన సోమశేఖర్ భార్య రేవతి(35) ఆదివారం గ్రామ సమీపంలోని రఘుపతి నాయుడు పొలంలో కూలి పనికి వెళ్లారు. అమ్మకోసం కొడుకు సిద్ధార్థ్ (15) కూడా ఆ పొలం వద్దకొచ్చాడు. పని ముగించుకుని కొడుకుతో కలిసి ఆమె ఇంటికి బయలుదేరారు. మామిడి పండు తింటూ వచ్చిన సిద్ధార్థ్.. ఉపాధి హామీ కింద తవ్విన నీటి కుంట (ఫారం పాండ్)లో చేతులు చేతులను కడుగుతుండగా ప్రమాద వశాత్తు పడిపోయాడు. నీట మునిగిపోతున్న కొడుకును కాపాడేందుకు రేవతి కూడా కుంటలో దిగారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో మునిగిపోయి మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా, సిద్ధార్థ్ ఈ ఏడాదే 10వ తరగతికి వచ్చాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం 108 అంబులెన్సులో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ సుమన్ తెలిపారు.