మాంసం మార్కెట్టా... మురికి కూపమా?
ABN , Publish Date - Jun 18 , 2026 | 01:13 AM
ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన పీపీ చావడి మార్కెట్ మార్చాల్సిందే కలెక్టర్, జేసీ, కమిషనర్లకు ఫుడ్ సేఫ్టీ అధికారుల నివేదిక
తిరుపతి సిటీ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి):తిరుపతిలో అనధికారికంగా నడుస్తున్న పీపీ చావడి మటన్ మార్కెట్‌లో నెలకొన్న నీచావహ దృశ్యాలు అధికారుల నివేదికలో మరోసారి బట్టబయలయ్యాయి. ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ హెల్త్, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన అనేక అంశాలను గుర్తించారు. కలెక్టర్ వెంకటేశ్వర్‌తో పాటు జేసీ, మున్సిపల్ కమిషనర్‌కు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్.మద్దులేటి నివేదికను సమర్పించారు. పీపీ చావడి మార్కెట్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, అక్కడి పరిస్థితులతో పాటు స్థానికులతో మాట్లాడి నివేదిక తయారుచేశామని మద్దులేటి తెలిపారు.
నివేదికలో ఏముంది?
జంతు వ్యర్థాలతో తీవ్ర దుర్వాసన
మార్కెట్‌లో రక్తం, జంతు వ్యర్థాలు నేలపై, గోడలపై పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం, మాంసం వ్యాపారుల్లో వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో మార్కెట్ మొత్తం అపరిశుభ్రంగా మారింది.మాంసం కోసం తీసుకొచ్చిన మేకలను, గొర్రెలను మార్కెట్ సమీపంలోని నివాస ప్రాంతాల్లోనే ఉంచుతున్నారు. జంతువుల విసర్జనల వల్ల పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపిస్తోండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం
మార్కెట్ ప్రహరీ గోడకు ఆనుకుని మున్సిపల్ పాఠశాల వుండడంతో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. మాంసం విక్రయాల కోసం ఏర్పాటు చేసిన మార్కెట్‌లోనే జంతువులను బహిరంగంగా వధిస్తున్నారు. మాంసం కాల్చే సమయంలో వచ్చే పొగ, దుర్వాసనలతో పరిసర ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
మార్కెట్ తరలింపుపై సూచన
ప్రస్తుతం మార్కెట్‌ను మూసివేయాలని, జనావాసాల మధ్య ఉన్న ఈ మార్కెట్‌ను అనువైన ప్రదేశానికి తరలించే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్‌కు సూచించినట్లు సమాచారం. మార్కెట్‌ను మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా మూసివేసినా పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు రాజకీయ నాయకులు మళ్లీ తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.