Share News

పట్టాలపై ఒంటరి ఏనుగు

ABN , Publish Date - Mar 12 , 2026 | 02:32 AM

ఒంటరి ఏనుగు రాత్రివేళ రైల్వే పట్టాలపైకి చేరింది. కాసేపు నిలబడింది. ఆ తర్వాత పట్టాలు దాటి పొలాల వైపు అడుగులేసింది. మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే రైలు వచ్చింది. కాసేపు ఏనుగు పట్టాలపైనే ఉండుంటే.. ఘోర ప్రమాదమే జరిగేది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటచేసుకుంది.

పట్టాలపై ఒంటరి ఏనుగు
కమ్మపల్లి వద్ద వరిపంటను తొక్కేసిన ఒంటరి ఏనుగు

రైలు వచ్చే ముందే పొలాల్లోకి వెళ్లడంతో తప్పిన ఘోర ప్రమాదం

కల్లూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఒంటరి ఏనుగు రాత్రివేళ రైల్వే పట్టాలపైకి చేరింది. కాసేపు నిలబడింది. ఆ తర్వాత పట్టాలు దాటి పొలాల వైపు అడుగులేసింది. మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే రైలు వచ్చింది. కాసేపు ఏనుగు పట్టాలపైనే ఉండుంటే.. ఘోర ప్రమాదమే జరిగేది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలోని దుర్గంకొండ నుంచి మంగళవారం రాత్రి ఒంటరి ఏనుగు గడ్డంవారిపల్లె, రేణుమాకుపల్లె, రామిరెడ్డిగారిపల్లె, రెడ్డివారిపల్లె పంచాయతీల మీదుగా చిచ్చిలివారిపల్లెకు చేరింది. అక్కడ పంటలను ధ్వంసం చేసుకుంటూ పులిచెర్ల-మంగళంపేట రోడ్డును దాటుకొని జడ్పీ హైస్కూలు ప్రాంగణంలోకి చేరుకుంది. క్రీడల కోసం ఏర్పాటు చేసిన స్తంభాలను విరిచేసి, ప్రహరీని పాక్షికంగా ధ్వంసం చేసింది. పాఠశాల సమీపంలోని రైల్వే పట్టాలపైకి చేరుకొని కొంత సేపు నిలబడింది. అటవీ సరిహద్దు నుంచి ఒంటరి ఏనుగును ఎఫ్‌ఎ్‌సవో మహమ్మద్‌ షఫీ, సిబ్బంది వెంబడిస్తూ వచ్చారు. పట్టాలపై నిలబడిన ఏనుగును చూసి ఆందోళన చెందారు. టపాకాయలు పేల్చి బెదిరించడంతో పొలాల్లోకి వెళ్లింది. కాసేపటి తర్వాత అటుగా రైలు రావడంతో ప్రమాదం తప్పింది. కమ్మపల్లి పంచాయతీలో మామిడి, వరి తదితర పంటలను ఏనుగు ధ్వంసం చేస్తూ సూరప్పచెరువు వద్దకు చేరుకుంది.

Updated Date - Mar 12 , 2026 | 02:32 AM