పేరుకే పెద్దాస్పత్రి
ABN , Publish Date - May 15 , 2026 | 12:48 AM
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు సవాలుగా మారాయి. అనేక సమస్యల నడుమ వైద్యం పొందడానికి రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కళ్లదుటే పరిస్థితులు కనిపిస్తున్నా అటు అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
- జిల్లా వైద్యశాలలో సేవలు గగనం
- వేధిస్తున్న డాక్టర్లు, సిబ్బంది కొరత
- మందులు కావాలంటే బయటకు వెళ్లాల్సిందే
- రోగుల అవస్థలు వర్ణనాతీతం
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు సవాలుగా మారాయి. అనేక సమస్యల నడుమ వైద్యం పొందడానికి రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కళ్లదుటే పరిస్థితులు కనిపిస్తున్నా అటు అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
మదనపల్లె అర్బన్, మే 14(ఆంధ్రజ్యోతి): మదనపల్లె ప్రభుత్వాస్పత్రి అంచెలంచెలుగా ఎదిగి జిల్లా స్థాయికి చేరినా ఆ మేరకు వైద్య సేవలు ఉండటం లేదు. ఇక్కడికి రోజుకు 1000 నుంచి 1,200 మంది రోగులు వస్తుంటారు. ఆస్పత్రిని డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. గతంలో 78మంది వైద్యులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 26కు చేరుకుంది. స్టాఫ్ నర్సులు, నర్సుల పోస్టులు వందల కొద్దీ ఖాళీగా ఉన్నాయి. ఉన్న కొద్దిమంది ఉద్యోగులు సరిగా విధులు నిర్వహించడం లేదు. డాక్టర్లు ఓపీ టైంలో గంట కూడా వైద్యం అందించడం లేదు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీలో వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఉదయం 10.30 గంటలలైనా డాక్టర్లు సీట్లో కనిపించడం లేదు. మధ్యాహ్నం 2 గంటలకు భోజన విరామ సమయం ఉంటే 12 గంటలకే సీట్లో నుంచి వెళ్లిపోతున్నారు. మధ్యాహ్నం తర్వాత అసలు కనిపించడం లేదు. ఈ క్రమంలో రోగులు వైద్యుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
మందుల నుంచి స్కానింగ్ వరకు అంతా దోపిడీనే..
ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు రాసిచ్చిన చీటీలో సగం మందులు బయటకొనాల్సి వస్తోంది. కమీషన్లకు అలవాటుపడిన వైద్యులు ఇక్కడ అందుబాటులో లేని మందులు రాసిస్తున్నారు. పైగా వారికి అనుకూలమైన మందుల షాపులోనే తెచ్చుకోవాలని సలహా ఇస్తున్నారు. కుట్లువేసే దారం నుంచి సెలైన్ బాటిల్ వరకు బయటకొనే విధంగా చేస్తున్నారు. అవసరమున్నా లేకున్నా రోగులను ప్రైవేటు ఆస్ప త్రులకు రెఫర్ చేస్తున్నారు. ప్రైవేటు అంబులెన్స్ వారితో లాలూచీపడి వాటిలో ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వారి నుంచీ కమీషన్ దండుకుంటున్నారు. ఇక స్కానింగ్‌లోనూ ఇదే పరిస్థితి. అవసరం లేకున్నా రోగి బంధువులను భయపెట్టి పలానా స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి స్కానింగ్ తీసుకురండి అంటూ పురమాయిస్తున్నారు. స్కానింగ్ తీసుకుని వచ్చిన తర్వాత తిరుపతికి రెఫర్ చేస్తున్నారు.
మూలనపడిన థైరాయిడ్ పరీక్షల యంత్రం
థైరాయిడ్ రోగులను పరీక్షించేందుకు గతంలో రూ.12 లక్షలతో యంత్రాన్ని కొనుగోలు చేశారు. దీని సాయంతో రోజూ వందమందికిపైగా రోగులకు పరీక్షలు చేసేవారు. ఎనిమిది నెలలుగా ఇది పనిచేయకపోవడంతో పరీక్షలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి రోజూ ఈ పరీక్షల కోసం వచ్చే 30 నుంచి 40 మంది రోగులు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇందుకోసం రూ.500 చొప్పున సమర్పించుకోవాల్సి వస్తోంది.
తగ్గుతున్న ఓపీ నమోదు
ఆస్పత్రిలో వైద్య సేవలు పొందడం సవాలుగా మారడంతో ఓపీ నమోదు క్రమేపి తగ్గుతోంది. గత ఏడాది రోజుకు 1,800 నుంచి 1,900 ఓపీ నమోదు కాగా ఈ ఏడాది అది 1,200 నుంచి వెయ్యికి పడిపోయింది. రోగులు ఆస్పత్రిలో కాలుమోపింది మొదలు బయటకు వెళ్లే వరకు దోపిడీకి గురవుతున్నారు. సరే వైద్య సేవలు బాగా అందుతున్నాయా అంటే అదీ లేదు. ఈ క్రమంలో భారమైనా ప్రైవేటు ఆస్పత్రులకే వెళుతున్నారు.
సమస్యలను చక్కదిద్దుతాం
ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. అన్ని రకాల మందులు అందుబాటులో లేవు. చిన్నచిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
- డాక్టర్ రాధిక, ఆర్‌ఎంవో, మదనపల్లె జిల్లా ఆస్పత్రి