Share News

ఎస్వీ మ్యూజియం ఆధునికీకరణలో కీలక మలుపు

ABN , Publish Date - Apr 18 , 2026 | 01:29 AM

తిరుమలలోని శ్రీవేంకటేశ్వర (ఎస్వీ) మ్యూజియం ఆధునికీకరణలో కీలక మలుపు చోటుచేసుకుంది. మిగిలిన పనులను చేపట్టేందుకు టీసీఎస్‌ సంస్థ అంగీకారం తెలిపింది.

ఎస్వీ మ్యూజియం ఆధునికీకరణలో కీలక మలుపు

తిరుమల, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని శ్రీవేంకటేశ్వర (ఎస్వీ) మ్యూజియం ఆధునికీకరణలో కీలక మలుపు చోటుచేసుకుంది. మిగిలిన పనులను చేపట్టేందుకు టీసీఎస్‌ సంస్థ అంగీకారం తెలిపింది. ప్రపంచంలోని ప్రఖ్యాత థియోసాఫికల్‌ మ్యూజియంలలో ఎస్వీ మ్యూజియం ఒకటి. ఇందులో ఫొటోలు, రాతి శిల్పాలు, ఆయుధాలు, వాయిద్య పరికరాలు, కంచు విగ్రహాల గ్యాలరీలు.. ఇలా దాదాపు 12 గ్యాలరీలు ఉండేవి. అలాగే క్రీ.శ ఒకటో శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు చెందిన అరుదైన కళాఖండాలు ఇక్కడ ప్రదర్శించేవారు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మ్యూజియంను అభివృద్ధి చేయాలని కొవిడ్‌కు ముందు నుంచే భక్తుల అనుమతిని రద్దు చేశారు. మ్యూజియం ఆధునికీకరణ కోసం టీసీఎం సంస్థ దాదాపు రూ.వంద కోట్ల విరాళంతో పనులు చేపట్టగా, ఔటర్‌ గ్యాలరీని రూ.20 కోట్ల డొనేషన్‌ పద్ధతిపై ఆధునికీకరించేందుకు బెంగళూరుకు చెందిన మ్యాప్‌ సిస్టమ్స్‌ సాఫ్ట్‌వేర్‌ ముందుకొచ్చింది. ఔటర్‌ గ్యాలరీలో టెంపుల్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేవా ఎక్స్‌పీరియన్స్‌, వాహన, సప్తగిరి మల్టీమీడియా గ్యాలరీల ఏర్పాటు చేస్తామని మ్యాప్‌ సిస్టమ్స్‌ సంస్థ చెప్పినప్పటికీ ఆ పనుల్లో ఏమాత్రం పురోగతి లేకుండా పోయింది. ఐదు జోన్లలో కేవలం ఒక్క జోన్‌ మాత్రమే చేసి.. మిగిలిన పనుల్లో నిర్లక్ష్యం చూపిన క్రమంలో ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని టీటీడీ ఇటీవల రద్దు చేసుకుంది. అయినప్పటికీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, మ్యూజియం అధికారులు ప్రత్యేక శ్రద్ధతో వీలైనంత త్వరగా మ్యూజియంను భక్తులకు అందుబాటులోకి తేవాలని కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే మ్యాప్‌ సిస్టమ్స్‌కు కేటాయించి.. రద్దు చేసిన పనులను మరొకరికి అప్పగించాలని టీటీడీ తొలుత భావించినా, ఇప్పటికే దాదాపు రూ.వంద కోట్లతో పనులు పూర్తిచేసిన టీసీఎస్‌ సంస్థే మిగిలిన ఔటర్‌ గ్యాలరీల పనులను కూడా చేపడతామని అంగీకారం తెలిపినట్టు తెలిసింది. ఈక్రమంలో ఈనెల 22వ తేదీన ఓ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఆ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలిరోజున సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎస్వీ మ్యూజియంను ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తేవడానికి టీటీడీ ప్రణాళికి సిద్ధం చేసింది.

Updated Date - Apr 18 , 2026 | 01:29 AM