‘స్థానిక’ ఎన్నికల దిశగా కీలక ముందడుగు
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:38 AM
స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. అందరి దృష్టీ స్థానిక సంస్థల రిజర్వేషన్లపై పడింది. తిరుపతి మేయర్ సహా ఏ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ పదవి ఏ వర్గానికి ఖరారవుతుందన్న దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్ మొదలుకుని శ్రీకాళహస్తి, నాయుడుపేట, సూళ్లూరుపేట, పుత్తూరు, వెంకటగిరి మున్సిపాలిటీలు, అలాగే గ్రామ పంచాయతీల నుంచీ మండల, జిల్లా పరిషత్‌ల దాకా ఎన్నికల వాతావరణం అలుముకుంది.ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ నడుస్తోంది.
వెనువెంటనే జారీ కానున్న షెడ్యూలు
ఏ పదవి ఎవరికన్న దానిపై సర్వత్రా ఆసక్తి
స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. అందరి దృష్టీ స్థానిక సంస్థల రిజర్వేషన్లపై పడింది. తిరుపతి మేయర్ సహా ఏ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ పదవి ఏ వర్గానికి ఖరారవుతుందన్న దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్ మొదలుకుని శ్రీకాళహస్తి, నాయుడుపేట, సూళ్లూరుపేట, పుత్తూరు, వెంకటగిరి మున్సిపాలిటీలు, అలాగే గ్రామ పంచాయతీల నుంచీ మండల, జిల్లా పరిషత్‌ల దాకా ఎన్నికల వాతావరణం అలుముకుంది.ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ నడుస్తోంది.
తిరుపతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కీలక ముందడుగు పడింది.ఈ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులతో అడ్డంకులు, సందిగ్ధత తొలగిపోయిన నేపధ్యంలో నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. గతంలో జరిగిన సమావేశంలోనే మంత్రివర్గం ఎస్సీ, ఎస్టీ స్థానాల శాతాలను ఖరారు చేసింది. బీసీ స్థానాల శాతాన్ని కూడా ఖరారు చేసినప్పటికీ సుప్రీంకోర్టు ఉత్తర్వులతో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి లోబడి ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ కారణంగా నేటి మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని గురించే ప్రఽధానంగా చర్చించి ఖరారు చేయనున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి మంత్రివర్గ నిర్ణయాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం వెళ్ళిన అనంతరం షెడ్యూలు విడుదల కానుంది. దానికి పెద్దగా సమయం పట్టే అవకాశం కనిపించడం లేదు. ఎలాంటి అడ్డంకులూ లేకుంటే సోమవారం షెడ్యూలు జారీ కావచ్చన్న అంచనాలున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం నెలకొంటోంది.అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికలకే ఓటర్లు, ప్రజలు అమిత ప్రాధాన్యత ఇస్తుండడం తెలిసిందే. దాంతో ఏ స్థానిక సంస్థ ఏ వర్గానికి రిజర్వు అవుతుందన్న దానిపై ఆ స్థానిక సంస్థ పరిధిలోని ప్రజల్లో ఆసక్తి నెలకొంటోంది.
జడ్పీ, మున్సిపల్ పదవుల రిజర్వేషన్లపై ఆసక్తి
తిరుపతి జిల్లా ఏర్పాటయ్యాక తొలిసారిగా ఇటీవలే జిల్లా పరిషత్ ఏర్పాటైంది. జడ్పీ ఛైర్ పర్సన్ పదవికి ఇపుడు జరిగేవే తొలి ఎన్నికలు.ఈ కారణంగా సంబంధిత పదవి ఏ కేటగిరీకి రిజర్వు అవుతుందన్న దానిపై జిల్లావ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ప్రజానీకంలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. మున్సిపల్ అధ్యక్ష పదవులదీ అదే పరిస్థితి. తిరుపతి మేయర్ పదవి గత ఎన్నికల్లో జనరల్ మహిళకు రిజర్వు కాగా అప్పట్లో వైసీపీ దాన్ని బీసీ మహిళకు ఇచ్చింది. ఈసారి జనరల్ కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా... ఏదో ఒక వర్గానికి దక్కుతుందన్న అంచనాలున్నాయి. మునుపటి ఎన్నికల్లో పుత్తూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి ఎస్సీ జనరల్‌కు, నాయుడుపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి ఎస్సీ మహిళకు ఖరారయ్యాయి. దీంతో ఈ పర్యాయం ఈ రెండు చోట్లా ఎస్సీయేతర వర్గాలకు ఖరారయ్యే అవకాశముందన్న అభిప్రాయం జనంలో వ్యక్తమవుతోంది. సూళ్ళూరుపేట మున్సిపల్ అధ్యక్ష పదవి గత ఎన్నికల్లో జనరల్ అయినందున ఇపుడు ఇతర కేటగిరీలకు ఖరారు కావచ్చుననే అంచనాలు పెరుగుతున్నాయి. వెంకటగిరి మున్సిపల్ అధ్యక్ష పీఠం గతంలో బీసీ మహిళకు ఖరారు కాగా ఈ పర్యాయం జనరల్ లేదా జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వు చేస్తారనే అభిప్రాయం వుంది. చివరగా శ్రీకాళహస్తి విషయానికొస్తే గత ఎన్నికల సమయంలో కోర్టు వివాదంతో ఇక్కడ ఎన్నికలు జరగలేదు. పదేళ్ళ విరామం తర్వాత ఎన్నికలు జరగనున్నందున ఇక్కడి రాజకీయ వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇక్కడ కూడా ఛైర్‌పర్సన్ పదవి ఏ కేటగిరీకి దక్కుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. జడ్పీటీసీ, ఎంపీపీ, పంచాయతీ సర్పంచ్ పదవుల గురించి ఆయా మండలాలు, పంచాయతీల పరిధిలో కూడా జనం ఆతృతగా వేచి చూస్తున్నారు.