హడలెత్తించిన ఏనుగుల మంద
ABN , Publish Date - Aug 10 , 2026 | 01:38 AM
రామకుప్పం మండలంలో 16ఏనుగుల మంద శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అటవీశాఖ అధికారులు, ననియా బేస్‌క్యాంపు సిబ్బందిని పరుగులు తీయించాయి. శనివారం రాత్రి 10.30 గంటల వరకు రామాపురంతండా సమీపంలోని కొల్లమడుగు ప్రాంతంలో ఏనుగుల మంద తిష్ట వేసినట్లు అధికారులు గుర్తించారు.
రామకుప్పం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలంలో 16ఏనుగుల మంద శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అటవీశాఖ అధికారులు, ననియా బేస్‌క్యాంపు సిబ్బందిని పరుగులు తీయించాయి. శనివారం రాత్రి 10.30 గంటల వరకు రామాపురంతండా సమీపంలోని కొల్లమడుగు ప్రాంతంలో ఏనుగుల మంద తిష్ట వేసినట్లు అధికారులు గుర్తించారు. అక్కడి చుట్టుపక్కల గ్రామాలైన వీర్నమల, రామాపురంతండా, జీడిమాకులపల్లె, 89పెద్దూరు, నారాయణపురంతండా, గుట్టూరుతండా ప్రజలను అప్రమత్తం చేశారు. 11గంటల ప్రాంతంలో అవి జీడిమాకులపల్లె మీదుగా చిత్తమానత్తం చేరుకున్నాయి. నారాయణపురంతండా వద్ద ఉన్న అధికారులు, బేస్‌క్యాంపు సిబ్బంది అక్కడకు చేరుకుని పెద్దటార్చిలైట్లు వేస్తూ, బాణసంచా పేల్చుతూ వాటిని సమీప అడవిలోకి తరిమారు. గాంధీనగర్, మొద్దులవంక, ముద్దనపల్లె పరిసర గ్రామాల వైపు ఏనుగులు వచ్చే అవకాశముందని అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. వారు అనుకున్నట్లే 12గంటల ప్రాంతంలో ఆ మందలోని కొన్ని ఏనుగులు రెడ్డివారిపల్లె, మొద్దులవంక, గాంధీనగరం సమీపపొలాల్లో సంచరిస్తూ బొప్పాయి, బీన్స్ తదితర పంటలను తొక్కి ధ్వంసం చేశాయి. అవి రామకుప్పం-విజలాపురం రహదారిని దాటుకుని కడిసినకుప్పం సమీపంలోకి వెళ్లాయి. అక్కడ్నుంచి శాంతిపురం మండలం మీదుగా కర్ణాటకకు తరలిపోతాయని అటవీశాఖ అధికారులు భావించారు. కానీ, తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో అవి వెళ్లిన దారివెంటే మొద్దులవంక అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. మందలోని మరికొన్ని ఏనుగులు ఆవులకుప్పం సమీప తోటల్లోకి చేరి మిరప, బీన్స్, టమోటా తోటలను పాక్షికంగా ధ్వంసం చేశాయి. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో కడిసినకుప్పం నుంచి తిరుగుముఖం పట్టిన ఏనుగులు వాటితో తిరిగి జతకట్టాయి. రెండు గంటల పాటు అటవీ సరిహద్దుల్లోనే హల్‌చల్ చేశాయి. వీటిని అధికారులు, బేస్‌క్యాంపు సిబ్బంది తెల్లవారుజామున 5గంటలకు సమీప అడవిలోకి తరిమేశారు. నారాయణపురంతండా సమీపంలోని ఏసీపొదలు అటవీ ప్రాంతంకు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. జీడిమాకులపల్లె, నారాయణపురంతండా, మద్దనపల్లె, ఆవులకుప్పం, మొద్దులవంక, గాంధీనగర్‌ల వైపు అవి తిరిగి వచ్చే అవకాశాలున్నాయని వారు తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు రాత్రి వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని, చీకటి పడక ముందే ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ఏనుగులు గ్రామాల వైపు వచ్చినప్పుడు వాటి దగ్గరకు వెళ్లడం, రెచ్చగొట్టే పనులు చేయరాదన్నారు. ఏనుగులు గ్రామాల వైపు వస్తే తమకు సమాచారమివ్వాలని కోరారు.
గౌనివానిచెరువులో ఏనుగుల గుంపు
బంగారుపాళ్యం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): బంగారుపాళ్యం మండలం మొగిలి గౌనివానిచెరువు సమీపంలో వారం రోజులుగా ఏనుగుల గుంపు మామిడి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. సుమారు 20 ఏనుగుల గుంపు సమీపంలోని అటవీ ప్రాంతంలో తిష్ట వేసి మామిడి చెట్ల కొమ్మలను విరిచేస్తున్నాయి. ఆదివారం సాయంత్రం ఈ ఏనుగులు గౌనివాని చెరువులో నీళ్లు తాగి అక్కడ నుంచి కమలనాథ రెడ్డి, శివరామిరెడ్డికి చెందిన మామిడి తోటల్లోకి వెళ్లాయి. ఈ ఏనుగులను దూరం నుంచి చూసిన రైతులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఎక్కడ ఏనుగుల గుంపు మీద పడుతుందోనని రైతులు తమ పొలాల వద్దకు వెళ్ళేందుకు భయపడుతున్నారు.