Share News

సైడ్‌ ఇమ్మన్నందుకు గొడవ

ABN , Publish Date - Apr 12 , 2026 | 01:11 AM

తిరుచానూరులోని అమ్మవారి ఆలయ సమీపంలో శనివారం రాత్రి ద్విచక్ర వాహదారుడిని సైడ్‌ ఇవ్వమన్నందుకు పెద్ద గొడవ జరిగింది. సీఐ సునీల్‌కుమార్‌ కథనం మేరకు.. పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం రాత్రి గజవాహన సేవ జరిగింది.

సైడ్‌ ఇమ్మన్నందుకు గొడవ

- వాహన బేరర్లను చితకబాదిన వైసీపీ శ్రేణులు

తిరుచానూరు, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): తిరుచానూరులోని అమ్మవారి ఆలయ సమీపంలో శనివారం రాత్రి ద్విచక్ర వాహదారుడిని సైడ్‌ ఇవ్వమన్నందుకు పెద్ద గొడవ జరిగింది. సీఐ సునీల్‌కుమార్‌ కథనం మేరకు.. పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం రాత్రి గజవాహన సేవ జరిగింది. అమ్మవారి వాహనం మోయడానికి చంద్రగిరి నుంచి వచ్చిన వాహన బేరర్లు తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. అమ్మవారి ఆలయం గేట్‌ నెంబరు1(పద్మావతి కన్వెన్షన్‌ సెంటర్‌) వద్ద బైకులపై వస్తుండగా అక్కడ తిరుచానూరుకు చెందిన దూర్వాసులురెడ్డి(వాసు) మరో ద్విచక్ర వాహనంపై వచ్చాడు. అతడిని సైడు ఇవ్వమన్న వాహన బేరర్‌ మహే్‌షతో వాసుకు గొడవ తలెత్తింది.దీంతో పక్కనున్న వాహన బేరర్లు వాసుపై దాడి చేశారు. ఈ విషయాన్ని వాసు తన బంధువులు, స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారు పెద్దసంఖ్యలో అక్కడికికి చేరుకుని వాహన బేరర్లను చితకబాదారు. మహే్‌షకైతే తల పగులగొట్టారు. మరో వాహన బేరర్‌ లవకుమార్‌, మరికొందరికీ తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులొచ్చి బాధితులను ఆస్పత్రికి తరలించారు. అయితే వాహనబేరర్లపై దాడి చేసిన వారంతా వైసీపీ శ్రేణులే కావడం గమనార్హం. దాడి సమాచారం అందుకున్న వాహన బేరర్ల బంధువులు చంద్రగిరి నుంచి పెద్దసంఖ్యలో సంఘటనా స్థలానికి తరలివచ్చారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని సంఘటనా స్థలానికి చేరుకుని, వాహనబేరర్ల బంధువులకు సర్దిచెప్పి పంపించేశారు.గొడవకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే కోరారు. కాగా, వైసీపీకి చెందిన చింతాల హరి మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 12 , 2026 | 01:11 AM