Share News

తిరుమల కొండల్లో డైనోసార్‌ కాలపు చెట్టు

ABN , Publish Date - Jan 18 , 2026 | 01:19 AM

కోట్ల సంవత్సరాల పరిణామాలను తన కణాలలో దాచుకుని.. డైనోసర్‌ కాలపు గాలిని ఇంకా తన ఆకుల్లో మోస్తూ.. మన తిరుమల కొండల్లో మాత్రమే ఉన్న మొక్క ఇది. తన స్వరూపాన్ని మార్చుకోకుండా కాలాన్ని దాటి నిలిచిపోయిన జీవ వారసత్యం దీని సొంతం. భూమి చరిత్రకు మిగిలి ఉన్న సజీవ సాక్ష్యాల్లో ఒకటి ఇది. ఈతచెట్టు అనే భ్రమ కలిగిస్తూ శేషాచలం అడవుల్లో నిశ్మబ్దంగా జీవిస్తున్న సైకస్‌బెడోమీ

తిరుమల కొండల్లో డైనోసార్‌ కాలపు చెట్టు
శేషాచలం పెరుగుతున్న పెర్రీత చెట్టు ఇదే

రైల్వేకోడూరు, ఆంధ్రజ్యోతి: కోట్ల సంవత్సరాల పరిణామాలను తన కణాలలో దాచుకుని.. డైనోసర్‌ కాలపు గాలిని ఇంకా తన ఆకుల్లో మోస్తూ.. మన తిరుమల కొండల్లో మాత్రమే ఉన్న మొక్క ఇది. తన స్వరూపాన్ని మార్చుకోకుండా కాలాన్ని దాటి నిలిచిపోయిన జీవ వారసత్యం దీని సొంతం. భూమి చరిత్రకు మిగిలి ఉన్న సజీవ సాక్ష్యాల్లో ఒకటి ఇది. ఈతచెట్టు అనే భ్రమ కలిగిస్తూ శేషాచలం అడవుల్లో నిశ్మబ్దంగా జీవిస్తున్న ఈ సైకస్‌బెడోమీ విశేషాలు.. ఈ ఆదివారం ప్రత్యేకం.

భూమిపై డైనోసర్లు సంచరించిన జురాసిక్‌ యుగం నుంచి ఉన్న చెట్టు ఇది. 280 మిలియన్‌ సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మొక్కను శాస్త్రవేత్తలు లివింగ్‌ ఫాసిల్‌ (ప్రాణమున్న శిలాజం) అని పిలుస్తారు. అంతరించిపోతున్న వృక్షజాతుల్లో అత్యంత అరుదైన చెట్టుగా గుర్తించిన ఇది.. మన తిరుమల కొండల్లో మాత్రమే ఉంది. వృక్ష శాస్త్రంలో దీని పేరు సైకస్‌ బెడోమీ. శేషాచలం అడవుల అంచున జీవించే యానాదులకు దీని ఆనుపానులు బాగా తెలుసు. వారు దీనిని పెర్రీత అనీ, కొండీత అనీ పిలుస్తారు. ఆయుర్వేదంలో దీనికి మదనకామాక్షి అనే పేరు కూడా ఉంది. తిరుమల కొండల్లోనూ, కొంత వెలుగొండ ప్రాంతంలోనూ ఇవి ఉన్నాయి.

జీవిత కాలం వెయ్యేళ్లు

సహజ అరణ్యాల్లో ఈ చెట్టు సాధారణంగా 300 నుంచి 1000 సంవత్సరాల వరకు జీవించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం శేషాచల అరణ్యాల్లో అక్కడక్కడా మిగిలివున్న ఈ చెట్లు మొఘల్‌ సామ్రాజ్య కాలం(1526-1857)లో మొలకెత్తినవి అయి వుండవచ్చని అంచనా. ఈ చెట్టు పునరుత్పత్తి మందగమనంతో సాగుతుంది. ఒక్క అడుగు పెరగడానికి 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. ఇది పూలు పూయని అరుదైన వృక్ష జాతి. పూలు లేకుండానే నేరుగా శంకువుల ద్వారా విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఆడ చెట్టు తన జీవితకాలంలో చాలా తక్కువ సార్లు మాత్రమే విత్తనాలు ఇస్తుంది. సాధారణంగా 12 నుంచి 15 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కాపు కనిపిస్తుంది. వీటిలో మొలకెత్తే గుణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆరేడు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుంది.

అరణ్య సంజీవిని

తిరుమల కొండల్లో తిరుగాడే యానాదులు దీనిని అనేక రకాలుగా వాడుతారు. పెర్రీత కాండంను పిండి చేసి సంగటిలో కలిపి తింటారు. గిరిజన వైద్యంలో దీనికి అనేక ప్రయోజనాలున్నాయి. శుద్ధి చేసిన గింజలని కీళ్ల నొప్పులు, నరాల బలహీనతకు దివ్యమైన ఔషధంగా భావిస్తారు. పెర్రీత ఆకుల రసం, శరీర వాపులు, దద్దుర్లు తగ్గడానికి వాడుతారు. గింజల నుంచి తీసిన నూనె ను చర్మ సమస్యలు, గాయాల మాన్పడానికి ఉపయోగిస్తారు. వేర్ల కాషాయం జీర్ణ సమస్యలకు, ఉపయోగిస్తారు. కానీ ఈ మొక్క గింజలు ముడిగా ఉంటే ప్రమాదకరం. వాటిలో ఉండే విషపదార్ధాలు కాలేయాన్నే దెబ్బతీయగలవు. నరాలపై ప్రభావం చూపగలవు. సరైన శుద్ధి లేకుండా వాడితే ప్రాణాలకు కూడా ప్రమాదం అంటారు. పెర్రీత చెట్టును అరణ్య సంజీవిని అని పిలుస్తారు.

తిరుమల కొండల్లోనే

చూడడానికి ఈ చెట్టు సాధారణ ఈత చెట్టులాగా ఉంటుంది. తేడా అడవిలో తిరిగే యానాదులకు బాగా తెలుస్తుంది. మన తిరుమల కొండల్లో మాత్రమే పెరిగే ఈ చెట్ల సంతతి బాగా తగ్గిపోతోంది. 2006కి ముందు వీటి సంఖ్య 1000కి లోపే అని భావించారు. ఆ తర్వాత జరిగిన అధ్యయనంలో వీటి సంఖ్య 20 వేల నుంచి 30 వేల దాకా ఉండవచ్చని అంచనా వేశారు. ఈ చెట్టుకు మండే గుణం తక్కువ. అందుకే అడవుల్లోని మంటలను అదుపు చేయడానికి దీని ఆకులను చీపురులా చేసి నిప్పును ఆర్పే ప్రయత్నం చేస్తారు.

Updated Date - Jan 18 , 2026 | 01:19 AM