Share News

వెలుగు కార్యాలయంలో చీకటి కోణం

ABN , Publish Date - Aug 10 , 2026 | 02:08 AM

మహిళా, డ్వాక్రా సంఘాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించే వెలుగు కార్యాలయంలో నిధుల దుర్వినియోగం కలకలం రేపుతోంది.

వెలుగు కార్యాలయంలో చీకటి కోణం

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఏపీఎం

గాలివీడు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : మహిళా, డ్వాక్రా సంఘాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించే వెలుగు కార్యాలయంలో నిధుల దుర్వినియోగం కలకలం రేపుతోంది. పెద్దరెడ్డెయ్య ఏపీఎంగా పనిచేసిన కాలంలో రూ.20.82 లక్షలు పక్కాదారి పట్టినట్లు ప్రస్తుత ఏపీఎం దేవసేన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 2022 నుంచి 2026 వరకు ఏపీఎంగా పనిచేసిన పెద్దరెడ్డెయ్యపై డ్వాక్రా సంఘాల సభ్యులు, రైతులు ఫిర్యాదులు చేయడంతో ప్రాథమికంగా పరిశీలించారు. ఎఫ్‌పీవోల నిధులు రూ.11,58,377, ఎఫ్‌పీజీలో బినాబీ పేర్లతో రూ.9,24,402, జెండర్‌ నిధులు రూ.1.50లక్షలు కలిపి మొత్తం రూ.20,82,779 మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. 2026 డీసీబీ రిజిస్టర్‌లో నమోదైన అంశాలను పరిశీలించగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఎగువగొట్టివీడు లక్ష్మీనరసింహ ఎఫ్‌పీజీకి సంబంధించిన రూ.48,056 అసలు, రూ.16,346 వడ్డీ మొత్తం దుర్వినియోగమైంది. అరవీడు గ్రామంలోని సత్యసాయి ఎఫ్‌పీజీ (అగ్రి ఎఫ్‌పీఓ)కి చెందిన రూ.3లక్షల రికవరీ సొమ్ము, గోరాన్‌చెరువు గ్రామంలోని సాయి ఆర్‌పీఏలో సభ్యుల పేర్లతో రూ.2.50 లక్షలమేర నిధుల వినియోగంపైనా స్పష్టత లేదు. జెండర్‌ నిఽధుల కింద నిరుపేద ఒంటరి మహిళలకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా అప్పటి ఏపీఎం తన సోదరుడు సిద్దయ్య ఉన్న గ్రూపునకు రూ.1.50లక్షలు ఇచ్చి రికవరీ చేయలేదు. తన భార్యను శ్రీనివాస్‌ ఎఫ్‌పీజీలో చేర్చి నెల రోజులు పూర్తికాకముందే రూ.3 లక్షలు ఆర్‌పీవో నుంచి తీసుకున్నారు. అందులో రూ.లక్ష రికవరీ కాలేదు. అలాగే పలు ఖర్చులకు సంబంధించిన బిల్లులు లేవు. కొన్నిటిపై సంతకాలు పెట్టలేదు. దీనికితోడు కార్యాలయానికి వచ్చిన రెండు ప్రొజెక్టర్లు, బ్యాటరీ, కుర్చీలు సైతం కనిపించడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 02:08 AM