Share News

చిన్నబోయిన పుంగనూరు

ABN , Publish Date - Aug 23 , 2026 | 02:59 AM

పుంగనూరు నియోజవర్గం గతంలో పుంగనూరు మున్సిపాలిటీ, మండలం, చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలన్నీ చిత్తూరు జిల్లాలో ఉండేవి. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రభుత్వం అమలు చేస్తోంది.

చిన్నబోయిన పుంగనూరు
జమీందారీ ప్యాలెస్‌

రెండు జిల్లాల్లో విస్తరణతో అయోమయం

ప్రజలు, అధికారులకు ఇక్కట్లు

మదనపల్లె జిల్లా ఏర్పాటుతో ఆరు మండలాలుగా ఉన్న పుంగనూరు నియోజకవర్గం నాలుగు మండలాలతో చిన్నబోయింది. పైగా రెండు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు.

పుంగనూరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): పుంగనూరు నియోజవర్గం గతంలో పుంగనూరు మున్సిపాలిటీ, మండలం, చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలన్నీ చిత్తూరు జిల్లాలో ఉండేవి. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రభుత్వం అమలు చేస్తోంది. రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్పు చేయడంతో రాజంపేటను కడపలో, రైల్వేకోడూరును తిరుపతిలో కలిపారు. కానీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకే జిల్లాలో ఉన్నాయి. పుంగనూరులో మాత్రం పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుంతో కలిసి నాలుగు మండలాలు అన్నమయ్య జిల్లా (మదనపల్లె)లో, మిగిలిన రెండు మండలాలైన పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు చిత్తూరు జిల్లాలో కలపడంతో ఇటు ప్రజలు, అటు ప్రజాప్రతినిఽధులు, అధికారుల్లో అయోమయం నెలకొంది. పుంగనూరు మొత్తం ఒకే జిల్లాలో ఉంటే పరిపాలన, రాజకీయ సౌలభ్యం ఉండేదని పలువురు భావిస్తున్నారు. దీనికితోడు రాజంపేట పార్లమెంట్‌ ఎన్నికలకు పుంగనూరు నియోజవర్గంలోని నాలుగు మండలాలు, చిత్తూరులోని రెండు మండలాలు, కడప జిల్లాలోని రాజంపేట, తిరుపతి జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గ ఓటర్లు ఓట్లు వేయాల్సి ఉంది.

అధికారులకు తగ్గిన పరిధి

గతంలో పుంగనూరు కేంద్రంగా ఏపీఎస్పీడీసీఎల్‌ ఈఈ కార్యాలయం పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో పనిచేసేది. ప్రస్తుతం జిల్లాల పునర్విభజనతో కుప్పం, పలమనేరు నియోజవర్గాలు చిత్తూరులో ఉండటంతో అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నాలుగు మండలాలకే పరిధి తగ్గిపోయింది. పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల ప్రజలు విద్యుత్‌, రెవెన్యూ, పోలీస్‌ తదితర శాఖలకు సంబంధించిన సమస్యలపై డివిజన్‌, జిల్లా కేంద్రమైన చిత్తూరుకు వెళ్లాల్సి ఉంది. జలవనరులశాఖ డీఈఈ పుంగనూరులో ఉండగా ఈఈ చిత్తూరు జిల్లాలోని పలమనేరు, ఎస్‌ఈ చిత్తూరు పరిధిలో ఉన్నారు. ఇక పోలీ్‌స శాఖలోనూ రెండు జిల్లాల పరిధిలో ఉంది. పుంగనూరు నియోజవర్గంలోని అన్ని మండలాలు అటవీశాఖకు సంబంధించి చిత్తూరు డీఎ్‌ఫవో పరిధిలో ఉండగా కొంతకాలం క్రితం పుంగనూరు రేంజర్‌ శ్రీరాములు సస్పెండ్‌ కావడంతో పలమనేరు అటవీ అధికారి ఇన్‌చార్జిగా ఉన్నారు. న్యాయస్థానాలు, కో-అపరేటివ్‌, జిల్లా పరిషత్‌, సబ్‌ రిజిస్ర్టార్‌, సబ్‌ ట్రెజరీ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు జిల్లా స్థాయి అధికారులు చిత్తూరు జిల్లా కేంద్రం పరిధిలోనే పనిచేస్తున్నారు. మదనపల్లె జిల్లా కేంద్రమైనా ఇంకా అనేక జిల్లా స్థాయి అధికారుల పోస్టులు మంజూరు కాకపోవడంతో పాత జిల్లాల పరిధిలో పనిచేస్తున్నారు.

అసెంబ్లీలో వినిపించని పుంగనూరు వాణి

కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి పుంగనూరు నియోజకవర్గ సమస్యల వాణి అసెంబ్లీ సమావేశాలో ఇంతవరకు వినిపించలేదు. పుంగనూరు నియోజవర్గం ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందడంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడంతో పుంగనూరు సమస్యలు చర్చించడంలేదు. పుంగనూరు నియోజవర్గానికి పొరుగునే మదనపల్లె, పలమనేరు, పీలేరు, చంద్రగిరి, పూతలపట్టు నియోజవర్గాలుండగా అక్కడ అందరూ అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నా ఎవరూ పుంగనూరు సమస్యలు గురించి సభలో ప్రస్తావించడంలేదు.

రెండు జిల్లాలతో రాజకీయ నేతలకు ఇక్కట్లు

అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పుంగనూరు నియోజకవర్గం విస్తరించడంతో ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు తీర్చడానికి రెండు జిల్లాల అధికారులతో చర్చించడం అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఇబ్బందిగా మారింది. ఈ నియోజకవర్గానికి అన్నమయ్యజిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌తో పాటు ఎస్పీలు ఇతర అధికారులకు సమస్యలు వివరించడం, అభివృద్ధి పనుల మంజూరుకు ప్రతిపాదనలు, తదితర అంశాలు మాట్లాడలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు మంజూరు కావాలంటే రెండు జిల్లాల అధికారులకు పుంగనూరు నియోజవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి ప్రతిపాదనలు ఇవ్వడం, అధికారులను కలవడం కొంత ఇబ్బందిగా ఉంది. అలాగే పులిచెర్ల, రొంపిచెర్లకు అతితక్కువ దూరంలో ఉన్న అన్నమయ్య జిల్లాలోని పీలేరు ఉండగా ఆ మండలాలకు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు చిత్తూరులో ఉండటం ప్రజలకు ఇబ్బందిగా మారింది.

Updated Date - Aug 23 , 2026 | 02:59 AM