మామూళ్ల మట్కాజాలం
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:19 AM
తిరుపతి జిల్లాను కుదిపేసిన శ్రీకాళహస్తి మట్కా వ్యవహారంలో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
తిరుపతి జిల్లాను కుదిపేసిన శ్రీకాళహస్తి మట్కా వ్యవహారంలో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన కొందరు ఖాకీలే మట్కా కింగ్‌పిన్ బి. పద్మనాభం అక్రమ సామ్రాజ్యానికి రక్షణ కవచంగా మారారన్న ఆరోపణలు పోలీసు శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నెలవారీ ప్యాకేజీలు, డిజిటల్ చెల్లింపుల రూపంలో ముడుపుల ప్రవాహం, కళ్లముందే నిందితుడు తిరుగుతున్నా అరెస్టు చేయకుండా తప్పించిన ఖాకీల నిర్వాకం డీఐజీ డాక్టర్ శేముషి బాజ్‌పాయ్ విచారణతో బట్టబయలైంది.
తిరుపతి(నేరవిభాగం), జూన్ 10 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి వన్‌టౌన్ సీఐ ప్రకాశ్‌కుమార్‌కు మట్కా కింగ్‌పిన్ పద్మనాభం నుంచి వరుసగా మూడు నెలల పాటు నెలకు రూ.లక్ష చొప్పున ముడుపులు అందినట్లు పోలీసు శాఖ అంతర్గత విచారణలో తేలింది. శ్రీకాళహస్తి వన్‌టౌన్ పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన క్రైం నెంబర్లు 188/2025, 47/2026 కేసుల్లో పద్మనాభం ప్రధాన నిందితుడిగా ఉన్నప్పటికీ, అతడు పట్టణ పరిసరాల్లోనే అందుబాటులో ఉన్నప్పటికీ అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకోలేదు.ప్రస్తుతం పూతలపట్టు సీఐగా పనిచేస్తున్న డి. గోపి గతంలో శ్రీకాళహస్తి వన్‌టౌన్ సీఐగా పనిచేశారు. అప్పటి నుంచి పద్మనాభంతో సంబంధాలు కొనసాగిస్తూ, మట్కా నిర్వహణకు అనుకూలంగా వ్యవహరించేందుకు సీఐ ప్రకాశ్‌కుమార్‌ను ప్రభావితం చేసినట్లు విచారణలో తేలింది. పద్మనాభం నుంచి ముడుపులు స్వీకరించి, అతడిని అరెస్టు చేయకుండా వదిలేయాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీ్‌సస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ జె.హేమాద్రి మట్కా నిర్వాహకుడు పద్మనాభంతో పాటు అతడి అనుచరులైన అమన్ అలియాస్ అమానుల్లా, షేక్ ఖాదర్ షరీఫ్ అలియాస్ లడ్డూ నుంచి ముడుపులు స్వీకరించినట్లు, తనతో పాటు పై అధికారుల కోసం కూడా ఆయన డబ్బులు తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ ఏడాది జనవరి 8, ఫిబ్రవరి 12, మార్చి 15, ఏప్రిల్ 14 తేదీల్లో పద్మనాభాన్ని అరెస్టు చేసే అవకాశం వచ్చినప్పటికీ, అతడిని అదుపులోకి తీసుకోలేదని విచారణలో గుర్తించారు.
ఫోన్‌పేలో మామూళ్ల జాడలు
మట్కా మామూళ్ల వ్యవహారంలో డిజిటల్ లావాదేవీల కోణం కూడా వెలుగులోకి వచ్చింది. శ్రీకాళహస్తి-2 టౌన్ పోలీ్‌సస్టేషన్ ఇన్స్‌పెక్టర్ డ్రైవర్‌గా పనిచేసిన ఏ.ఎం.ప్రతాప్ ఫోన్‌పే ఖాతాకు మట్కా నిర్వాహకుల నుంచి నగదు బదిలీ అయినట్లు విచారణలో గుర్తించారు. ఆ డబ్బును తనతోపాటు పై అధికారులకు పంచేందుకు స్వీకరించినట్లు అభియోగాలు నమోదయ్యాయి.శ్రీకాళహస్తి ఎస్‌డీపీవో కార్యాలయంలో పనిచేసిన కానిస్టేబుల్ ఎన్.ప్రవీణ్ మట్కా నిర్వాహకుల నుంచి నెలవారీగా నగదు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. అందులో కొంత మొత్తాన్ని తనకోసం, మిగిలిన మొత్తాన్ని పైస్థాయి అధికారులకు ఇవ్వాలని దండుకున్నట్టు విచారణలో గుర్తించారు. అలాగే కానిస్టేబుల్ ఆర్. క్రాంతికుమార్ కూడా మట్కా నిర్వాహకులతో సంబంధాలు పెంచుకుని, పై అధికారుల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
సీడీఆర్‌లతో బట్టబయలైన బంధాలు
ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు క్రైమ్ ఏఎస్పీ నేతృత్వంలోని విచారణ బృందం సేకరించిన ఆధారాలు ఈ కేసుకు కీలకంగా మారాయి. పద్మనాభం వాంగ్మూలం, కాల్ డీటైల్ రికార్డులు (సీడీఆర్‌లు), బ్యాంకు, ఫోన్‌పే లావాదేవీలు, ఇతర ఆర్థిక ఆధారాలను పరిశీలించగా మట్కా నిర్వాహకులు, కొందరు పోలీసు సిబ్బంది మధ్య తరచూ ఫోన్ సంప్రదింపులు జరిగినట్లు విచారణలో తేలింది. మట్కాను నిర్మూలించాలని ఎస్పీ ఇచ్చిన ఆదేశాలనూ శ్రీకాళహస్తి పోలీసు అధికారులు, సిబ్బంది ఖాతరు చేయలేదని డీఐజీ సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం.మట్కా వ్యవహారంలో సస్పెండైన సీఐ ప్రకాశ్‌కుమార్, కానిస్టేబుళ్లు హేమాద్రి, ప్రతాప్, ప్రవీణ్, క్రాంతికుమార్ తిరుపతి హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, సీఐ గోపి చిత్తూరు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ దాటి వెళ్లరాదని స్పష్టం చేశారు.
బయటపడింది కొంతమాత్రమే
మట్కాలో ఇప్పటివరకు బయటపడింది శ్రీకాళహస్తి సబ్‌డివిజన్ పరిధిలో జరిగిన వ్యవహారం మాత్రమే. అయితే పద్మనాభం నెట్‌వర్క్ తిరుపతి, పుత్తూరు, నగరి, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల వరకు విస్తరించినట్లు విచారణలోనే తేలింది. మరి జిల్లాలో ఇంకా ఎంతమంది పద్మనాభంలు ఉన్నారు ? ఎంతమంది బుకీలు, రైటర్లు చాపకింద నీరులా దందా సాగిస్తున్నారు ? వారికి అండగా నిలిచిన ఇంటి దొంగలు ఎవరన్నది తేలాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో మామూళ్ల వ్యవస్థ నడిచిందా? ఎవరెవరికి ఎంతమేరకు ముడుపులు అందాయి అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మిగతా ప్రాంతాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు జరిపి ఇంటి దొంగలను గుర్తించి, మట్కా నెట్‌వర్క్‌ను సమూలంగా నిర్మూలించాల్సి ఉంది.