Share News

‘స్థానిక’ ఎన్నికల్లో క్లీన్‌స్వీ్‌ప చేయాల్సిందే

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:41 AM

పదవులిచ్చాం.. ఇప్పుడు జాతకాలు చూస్తున్నాం కుప్పం నియోజకవర్గ శ్రేణుల సమావేశంలో చంద్రబాబు

‘స్థానిక’ ఎన్నికల్లో   క్లీన్‌స్వీ్‌ప చేయాల్సిందే
యువగళం పాదయాత్ర ప్రారంభించి మూడేళ్లయిన సందర్భంగా పాట సీడీ ఆవిష్కరిస్తున్న చంద్రబాబు

కుప్పం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీ్‌ప చేసితీరాలని పార్టీ శ్రేణులకు సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్య నిర్దేశం చేశారు. కుప్పం పర్యటనలో మూడో రోజైన ఆదివారం ఆయన శాంతిపురం మండలం తుమ్మిశిలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితులు, నాయకత్వం పనితీరుపై సుదీర్ఘంగా సమీక్షించారు. ‘పార్టీ పదవులన్నింటినీ సామాజికవర్గాల వారీగా సమతుల్యంగా ఇచ్చాం. మహిళల భాగస్వామ్యం 49 శాతం ఉంది. నాయకులు ఇంకా ప్రజల్లో మమేకం కావడం లేదు. పదవులిచ్చాం, ఇప్పుడు జాతకాలు చూస్తున్నాం. నేనేదైనా వ్యక్తుల గురించి సమాచారం అడిగితే వాళ్ల ముఖం కూడా తెలియదు సార్‌ అంటారు. ఇది పద్ధతి కాదు’ అంటూ సున్నితంగా మందలించారు. ఎక్కడైనా అనర్హులకు పింఛన్లు వస్తుంటే రద్దుచేసి అర్హులకు ఇవ్వడం తమ బాధ్యతన్నారు. ఇటువంటి పొరపాట్లు సరిదిద్దుకోవాలంటే శ్రేణులు ప్రజల్లో ఉండాలని సూచించారు. ఎక్కడాలేని సంక్షేమం, అభివృద్ధి ఇక్కడ జరుగుతుంటే చెప్పుకొనే వారు లేకపోతే ఎలాగని నిలదీశారు. ‘చేసిన పని చెప్పుకొన్నప్పుడే మనం ఏం చేస్తున్నామన్నది ప్రజలకు తెలుస్తుంది. అది జరిగితే శాశ్వతంగా టీడీపీ అధికారంలో ఉంటుంది. మీకూ శాశ్వతంగా గౌరవం దక్కుతుంది’ అన్నారు.

లోపాలుంటే మార్పు తప్పదు

పార్టీ పదవుల్లో ఉన్న వారి పనితీరును ఐవీఆర్‌ఎస్‌ తదితర సర్వేల ద్వారా అధినేత చంద్రబాబు సమీక్షించారు. వారికి సర్వేలో వచ్చిన మార్కుల ప్రకారం గ్రేడ్లను ఇచ్చారు. ‘యాక్టివ్‌గా టిప్‌టా్‌పగా కనిపిస్తారు. పనికిమాత్రం వెనుకబడుతారు. ముందు పనిచేయడం నేర్చుకోండి’ అని తక్కువ గ్రేడ్లు వచ్చిన నాయకులకు చురకలు అంటించారు. ‘నాయకులు కంట్రోల్‌లో ఉండాలి. మీకే కాదు, ఇది నాకూ వర్తిస్తుంది. లోపాలుంటే మాత్రం నాయకత్వంలో మార్పు తప్పదు’ అని నవ్వుతూనే హెచ్చరించారు. ‘శ్రీకాంత్‌ రాలేదు, శ్రీకాంత్‌ చెప్పలేదు అనకూడదు. ఎన్నికలను గెలిపించే విషయంలో పూర్తి బాధ్యత స్థానిక నాయకులదే’నని స్పష్టం చేశారు. కూటమిలోని బీజేపీ, జనసేన నేతలను ఎక్కడికక్కడ కలుపుకుని పోవాలన్నారు. ఓట్లు పెరగాలంటే ఐక్యమత్యం అవసరమన్నారు. టెక్నాలజీని సరిగా వినియోగించుకుంటే కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉండదన్నారు.

ప్రయోగశాలగా కుప్పం

గతంలోనూ, ప్రస్తుతమూ కుప్పాన్ని ప్రయోగశాలగా చేసి ప్రారంభించిన పథకాలనే రాష్ట్రమంతటా అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. చిత్తూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన షణ్ముఖరెడ్డి కార్యదీక్షను గురించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జెండా భుజాన మోసి, గెలిచే వరకూ పనిచేయడం పార్టీ కార్యకర్తలకు అలవాటని అభినందించారు. ఎన్ని ఇబ్బందులు, సంక్షోభాలు వచ్చినా టీడీపీ కాబట్టే నిలదొక్కుకోగలిగిందన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌ కుప్పంనుంచి యువగళం ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తయారు చేసిన పాట సీడీని సీఎం ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ సురేశ్‌బాబు, కుప్పం మున్సిపల్‌, కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండల పార్టీ అధ్యక్షులు కాణిపాకం వెంకటేశ్‌, రాజగోపాల్‌, సుబ్రహ్మణ్యం, ఉదయకుమార్‌, వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్‌ జి.మునిరాజు, రెస్కో చైర్మన్‌ వీజీ.ప్రతాప్‌, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కడా పీఏసీ సభ్యుడు రాజ్‌కుమార్‌, ఏపీఐఐసీ డైరెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌, టీటీడీ సభ్యుడు వైద్యం శాంతారాం, ఏఎంసీ మాజీ చైర్మన్‌ సత్యేంద్రశేఖర్‌, నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నా చుట్టూ తిరిగితే లాభం లేదు

కార్యకర్తల సమావేశానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. తనచుట్టూ తిరుగుతూ పొగిడేవారు అవసరం లేదని ఖరాఖండిగా చెప్పారు. ‘మీరు ఊహించని పదవులిచ్చా. అయినా కార్యకర్తలను సమన్వయం చేసుకోలేక పోతున్నారు. నా చుట్టూ తిరగడం మాని, కార్యకర్తల సంక్షేమం పట్టించుకోండి’ అని హితవు పలికారు. ‘అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియాలంటే కార్యకర్తలు ముఖ్యం. వాళ్లే ప్రజల్లో ఉండేది. ఎన్నికలప్పుడు జెండా మోసి కష్టపడేదీ వాళ్లే. స్థానిక ఎన్నికల్లో విజయంకోసం ఇప్పటి నుంచే శ్రమించాలి’ అని పేర్కొన్నారు.

సాదర వీడ్కోలు

కుప్పంలో మూడు రోజుల పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబుకు టీడీపీ నాయకులు, అధికారులు సాదర వీడ్కోలు పలికారు. తుమ్మిశి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి బెంగళూరుకు, అక్కడినుంచి విమానంలో అమరావతికి బయలుదేరి వెళ్లారు. నియోజకవర్గ నేతలతో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌, అనంతపురం రేంజ్‌ డీఐజీ షిమోషి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ తుషార్‌ డూడీ, కడా పీడీ వికాస్‌ మర్మత్‌ తదితరులు సీఎంకు వీడ్కోలు పలికారు.

Updated Date - Feb 02 , 2026 | 12:41 AM