నగరంపై ‘కెమెరా కన్ను’
ABN , Publish Date - Apr 18 , 2026 | 01:25 AM
ఏ మూలన ఏ సంఘటన జరిగినా తెలిసిపోతుంది తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
తిరుపతి సెంట్రల్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్ సిటీలో భాగంగా తిరుపతి నగరమంతా ఇకపై కెమెరాలు ఉంటాయి. ఏ మూలన ఏ సంఘటన జరిగినా వెంటనే తెలిసిపోతుంది. వీటిని ఒకచోట నుంచే పర్యవేక్షించడానికి వీలుగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను కచ్చపి ఆడిటోడియంలో శుక్రవారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, కమిషర్ మౌర్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీలు అయిన వైజాగ్, కాకినాడ తరహాలో తిరుపతి నగరంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్, శానిటేషన్, ఎమర్జెన్సీ వంటి సేవలకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో 360 డిగ్రీల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు రూ.120కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 80శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మరో రెండునెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు. నగరవాసులకే కాకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు భద్రత కల్పించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. తిరుమలలో సీఎంచే ప్రారంభించిన సెంటర్‌తో అనుసంధానం చేస్తే స్థానిక ఆలయాలతోపాటు తిరుమలలో జరిగే ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చన్నారు. ఎస్పీ మాట్లాడుతూ, కెమెరాల వల్ల ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, క్రైమ్ మేనేజ్‌మెంట్ చేయడానికి ఉపయోగంగా ఉంటుందన్నారు. కమిషనర్, స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య మాట్లాడుతూ, స్మార్ట్ సిటీ నిధులతో ఎన్‌ఈసీ, కెలా్ట్రన్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 135 ప్రదేశాల్లో 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్లాక్‌స్పాట్ గుర్తించడంతోపాటు కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తవేసేవారిని, భవన నిర్మాణ వ్యర్థాలను వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డాక్టర్ హరిప్రసాద్, రుద్రకోటి సదాశివం, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్‌సీ మునికృష్ణ, అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్‌సుందర్, స్మార్ట్‌సిటీ జీఎం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.