సందడిగా మగవాళ్ల పండగ
ABN , Publish Date - Jan 12 , 2026 | 01:29 AM
మగవాళ్లకు మాత్రమే ప్రత్యేకమైన పొంగుబాళ్ల పండుగ ఆదివారంనాడు రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలోని తిప్పాయపల్లెలో సందడిగా జరిగింది. ఇక్కడి సంజీవరాయస్వామికి పెద్ద సంఖ్యలో మగవాళ్లు పొంగళ్లు స్వయంగా వండి ప్రసాదంగా సమర్పించారు.
సంజీవరాయస్వామికి పొంగలి వండి మొక్కులు తీర్చుకున్న పురుషులు
పుల్లంపేట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మగవాళ్లకు మాత్రమే ప్రత్యేకమైన పొంగుబాళ్ల పండుగ ఆదివారంనాడు రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలోని తిప్పాయపల్లెలో సందడిగా జరిగింది. ఇక్కడి సంజీవరాయస్వామికి పెద్ద సంఖ్యలో మగవాళ్లు పొంగళ్లు స్వయంగా వండి ప్రసాదంగా సమర్పించారు. సమీప గ్రామాల నుంచి మగవాళ్లు ఉదయాన్నే స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి భక్తిశ్రద్దలతో పొంగళ్లు సామగ్రితో ఆలయానికి వచ్చారు. ప్రాంగణంలో రాళ్లపొయ్యిలు పెట్టి పొంగళ్ళను వారే వండారు. సంజీవరాయస్వామికి 101 బిందెలతో అభిషేకం చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చారు. మహిళలకు ఆలయ ప్రవేశం లేకపోవడంతో వారంతా వెలుపలే వేచి ఉన్నారు. పూజారి ఆలయం వెలుపలకు వచ్చి మహిళలకు హారతి ఇచ్చారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ చేశారు. కొబ్బరి గిన్నెలు, బెల్లం ముద్దలను స్వామివారికి కానుకలుగా సమర్పించారు. ప్రతియేడాది సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారం పొంగుబాళ్లు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. దీనిని ఇప్పటికీ చెక్కుచెదరకుండా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సంజీవరాయస్వామి మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.