పన్ను బకాయిల పంట పండింది
ABN , Publish Date - Oct 14 , 2026 | 01:51 AM
స్థానిక ఎన్నికల పుణ్యమాని ఆశావహులు వివిధ పన్నుల బకాయిలను క్యూలో నిలబడి మరీ కడుతున్నారు. నిరంభ్యతర పత్రాల కోసం వారు ఈవిధంగా హైరానా పడుతున్నారు.
మున్సిపాలిటీల్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు
స్థానిక ఎన్నికల వేళ ఖజానాకు ఆదాయం
మదనపల్లె, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల పుణ్యమాని ఆశావహులు వివిధ పన్నుల బకాయిలను క్యూలో నిలబడి మరీ కడుతున్నారు. నిరంభ్యతర పత్రాల కోసం వారు ఈవిధంగా హైరానా పడుతున్నారు. మున్సిపాలిటీల్లో చైర్మన్‌తోపాటు కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులు ఆస్తి, నీటి, ఖాళీజాగా పన్నులు, ట్రేడ్ లైసెన్సు ఫీ, ఇలా మున్సిపాలిటీలో నమోదైన పన్ను చెల్లింపులపై దృష్టి పెట్టారు. బకాయిలు చెల్లించి రసీదు పొందుతున్నారు. వీటిని జత చేసి మున్సిపల్ కార్యాలయంలో ఎన్‌వోసీ(నిరంభ్యతర పత్రం) జారీ కౌంటర్లలో పన్ను రశీదులు సమర్పించి క్లియరెన్స్ తీసుకుంటున్నారు. వారుంటున్న వార్డులోనే కాదు.. మరెక్కడైనా పన్ను బకాయి ఉన్నారా? అనే అంశంపై మున్సిపల్, సచివాలయ సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఆన్‌లైన్‌లో క్షుణ్ణంగా పరిశీలించాక క్లియరెన్స్ ఇస్తున్నారు. మదనపల్లె, రాయచోటి, పుంగనూరు, బి.కొత్తకోట మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.
వార్డులోనూ అయిదుగురు
జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రతి వార్డులోనూ సగటున అయిదుగురికి తక్కువ లేకు ండా ఎన్‌వోసీలు తీసుకుంటున్నారు. రిజర్వేషన్లతో పని లేకుండా అన్ని పార్టీలూ..అన్ని సామాజిక వర్గాల నుంచి(ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్) ఎన్‌వోసీలతోపాటు రిజర్వేషన్ స్థానా ల్లో కులధ్రువీకరణ పత్రం పొందుతున్నారు. టీడీపీ, వైసీపీల్లో మాత్రం అధిష్ఠానం సూచనల మేరకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆ బాధ్యతను పార్టీ అధిష్ఠానం వార్డు ఇన్‌ఛార్జికి అప్పగించింది. నామినేషన్ దాఖలు, పరిశీలనలో ఎదురయ్యే ఇబ్బందులను దృ ష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త పడుతున్నారు. ప్రత్యర్థుల అభ్యంతరంతోనో లేక సాంకేతికంగా నామినేషన్ తిరస్కరణకు గురైతే అనర్హతకు గురవుతారు. అప్పటికప్పుడు వీటిని పొందే అవకాశం ఉండదు. ఈక్రమంలోనే కుటుంబసభ్యులు లేదా వార్డుల్లో తమకు అ యిన వారిని సిద్దం చేస్తున్నారు. కొందరు తమ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే ఇద్దరు ప్రపోజర్స్(ఓటర్లు) కూడా ఎన్‌వోసీ తీసుకుంటున్నారు. పోలీసుల నుంచి కూడా ఎన్‌వోసీ తీసుకుంటున్నారు.