Share News

కోలాహలంగా ఎద్దులపండుగ

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:58 PM

సంక్రాంతి సంబరాల్లో భాగంగా రామకుప్పంలో శుక్రవారం ఎద్దులపండుగ కోలాహలంగా జరిగింది.

  కోలాహలంగా ఎద్దులపండుగ
జనసమూహం మధ్య దూసుకెళ్తున్న ఎద్దులు

రామకుప్పం/శాంతిపురం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సంబరాల్లో భాగంగా రామకుప్పంలో శుక్రవారం ఎద్దులపండుగ కోలాహలంగా జరిగింది. ఎద్దుల పండుగను చూసేందుకు తరలివచ్చిన భారీ జనంతో స్థానిక దిగువవీధి జనసంద్రంగా మారింది. మధ్యాహ్నం స్థానిక రెడ్డివీధి నుంచి రైతులు దేవరెద్దులను దిగువవీధి గంగమ్మ ఆలయం వద్దకు మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చారు. అక్కడ దేవరెద్దులకు పూజలు చేసిన అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ ఎద్దులను భారీ జనసందోహం మధ్య పరుగులెత్తించారు. ఎద్దులను నిలువరించి నిర్వాహకులు వాటికి కట్టిన లుంగీలను చేజిక్కించుకునేందుకు పోటీ పడ్డారు. గోవిందపల్లె, కెంచనబల్ల తదితర గ్రామాల్లోనూ ఎద్దుల పండుగలను ఘనంగా నిర్వహించారు.శాంతిపురం మండలంలోనూ శుక్రవారం కనుమ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మధ్యాహ్నం రంగురంగుల కాగితపు పూలతో పశువులను అలంకరించి పరుగులు పెట్టించారు. బోయనపల్లె, కర్లగట్ట గ్రామాల్లో పశువుల పండుగ నిర్వహించారు.

పుల్లయ్యగారిపల్లెలో జల్లికట్టు

చంద్రగిరి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కనుమ పండుగ సందర్భంగా శుక్రవారం చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లెలో జల్లికట్టు నిర్వహించారు. ఉదయం గ్రామ దేవతకు పూజలు చేశాక తమ కోడెగిత్తలు, ఆవులు, దూడల కొమ్ములకు రంగులేశారు. కొప్పులు తొడిగారు. నగదు, విలువైన వస్తు సామగ్రి, రాజకీయ నాయకులు, సినీనటుల ఫొటోలతో చెక్క పలకలను కొమ్ములకు కట్టారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నడివీధిలో పశువులను గుంపులుగా వదిలారు. వేలాదిగా తరలి వచ్చిన యువకులు అల్లె అవతల నిలబడి కోడెగిత్తలను నిలువరించేందుకు పోటీ పడ్డారు. బహుమతులున్న చెక్క పలకలను సొంతం చేసుకొనేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో యువకుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు ఇటు తిరుగుతున్న ఓ వృద్ధురాలిని ఎద్దు ఢీ కొనడంతో అపస్మారస్థితిలోకి వెళ్లారామె. 108లో ఆమెను తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. భారీగా తరలివచ్చిన జనం ఇళ్లపై, చెట్ల కొమ్మపై నిలబడి జల్లికట్టును తిలకించారు.

ఎ.రంగంపేటలో తొలిసారి ఆగిన జల్లికట్టు

సంక్రాంతి మరుసటి రోజు చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో భారీ స్థాయిలో జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీ. ఆ గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో 20 ఏళ్లలో తొలిసారి జలికట్టు వాయిదా వేశారు. మరో రోజు నిర్వహించడానికి గ్రామస్తులు చర్చలు జరుపుతున్నారు.

Updated Date - Jan 16 , 2026 | 11:58 PM