Share News

న్యాయవాది దారుణ హత్య

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:23 AM

పాత గొడవల నేపథ్యంలో ఓ న్యాయవాది దారుణహత్యకు గురయ్యాడు.

  న్యాయవాది దారుణ హత్య
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారులు, వైద్యులు ఇన్‌సెట్‌లో న్యాయవాది పూజారి ఎల్లయ్య (ఫైల్‌ ఫొటో)

పీలేరు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): పాత గొడవల నేపథ్యంలో ఓ న్యాయవాది దారుణహత్యకు గురయ్యాడు. కేవీ పల్లె మండలం తీతవగుంటపల్లె పంచాయతీ పాత వడ్డిపల్లెలో సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్‌.కృష్ణమోహన్‌ కథనం మేరకు పాతవడ్డిపల్లెకు చెందిన పూజారి ఎల్లయ్య (35) పీలేరు కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నాడు. గ్రామంలో అతని కుటుంబానికి, మరికొన్ని కుటుంబాలకు మధ్య మనస్పర్థలున్నాయి. పలుమార్లు వాగ్వాదాలు, గొడవలూ జరిగాయి. ఇదేక్రమంలో గ్రామంలోని ఓ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ మార్పు విషయంలో సోమవారం మరోమారు వాగ్వాదం చెలరేగింది. తర్వాత పీలేరులో వృత్తిపరమైన పనులు ముగించుకుని ఎల్లయ్య రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఇంటిలోని తన కార్యాలయంలో పని చేసుకుంటుండగా ఇతనిపై రాత్రి 11 గంటల ప్రాంతంలో కొంతమంది దాడికి యత్నించారు. గమనించిన ఎల్లయ్య తన కార్యాలయానికి లోపలి వైపు తాళం వేసుకున్నాడు. తన ఇంటిలోని వారిని బయటకు వెళ్లవద్దని హెచ్చరించాడు. అయితే దుండగులు కార్యాలయ తాళాన్ని పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఎల్లయ్యను వీధిలోకి ఈడ్చుకు వచ్చి కొడవళ్లు, సిమెంటు ఇటుకలు, గ్రానైట్‌ రాళ్లతో దాడి చేశారు. దాడిని అడ్డుకోబోయిన ఎల్లయ్య తల్లిదండ్రులు రెడ్డమ్మ (50), వెంకటరమణ (55)లకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పాత వడ్డిపల్లెకు చేరుకున్నారు. ఎల్లయ్య, అతని కుటుంబసభ్యులను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఎల్లయ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని తల్లిదండ్రులను పోలీసులు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. న్యాయవాదులు, పలువురు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అటు పాత వడ్డిపల్లెలోనూ, ఇటు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో పికెట్‌ ఏర్పాటు చేశారు. ఎల్లయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేవీపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు బృందాల ఏర్పాటు

డీఎస్పీ కృష్ణమోహన్‌ మంగళవారం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోని ఎల్లయ్య మృతదేహాన్ని పరిశీలించారు. కలకడ సీఐ లక్ష్మణ, పీలేరు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌లతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్లయ్య కుటుంబానికి, నేరచరిత్ర కలిగిన మరికొన్ని కుటుంబాలకు పాత కక్షల కారణంగానే హత్య జరిగినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఆరుగురు దాడి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. వారిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

బార్‌ అసోసియేషన్‌ నిరసన

ఎల్లయ్య హత్యను పీలేరు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు తీవ్రంగా ఖండించారు. మంగళ, బుధవారాల్లో తమ విధులను బహిష్కరిస్తున్నట్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బీసీ పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్‌ ప్రకటించారు. నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చూడాలని వారు ఎస్పీ ధీరజ్‌ను ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా న్యాయవాదుల పరిరక్షణ చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మృతదేహానికి బార్‌ అసోసియేషన్‌ సభ్యులతో పాటు పలువురు ప్రజా సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు నివాళులు అర్పించారు.

Updated Date - Apr 08 , 2026 | 12:23 AM