Share News

వేటకు విరామం

ABN , Publish Date - Apr 15 , 2026 | 02:00 AM

ఎగసిపడే అలలను చీల్చుకుంటూ పగలూరాత్రి తేడా లేకుండా నడిసంద్రంలో జీవన పోరాటం చేసే మత్స్యకారులకు రెండునెలల విశ్రాంతి లభించనుంది. మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ప్రభుత్వం బుధవారం నుంచి 61 రోజుల పాటు చేపల వేటకు విరామం ప్రకటించింది.

వేటకు విరామం
తూపిలిపాళెం తీరంలో నిలిపివుంచిన మత్స్యకారుల బోట్లు

నేటినుంచి 61రోజుల పాటు చేపల పట్టివేతకు బ్రేక్‌

మత్స్య సంపద వృద్ధికి ఈ రెండు నెలలే కీలకం

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఎగసిపడే అలలను చీల్చుకుంటూ పగలూరాత్రి తేడా లేకుండా నడిసంద్రంలో జీవన పోరాటం చేసే మత్స్యకారులకు రెండునెలల విశ్రాంతి లభించనుంది. మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ప్రభుత్వం బుధవారం నుంచి 61 రోజుల పాటు చేపల వేటకు విరామం ప్రకటించింది.వాకాడు, సూళ్ళూరుపేట, తడ మండలాల్లో 53.97 కిలోమీటర్ల పొడవునా సముద్ర తీరం విస్తరించి ఉంది. తీర గ్రామాల్లోని మత్స్యకారులు చేపల వేటతో జీవనం సాగిస్తున్నారు.అయితే ఏప్రిల్‌-జూన్‌ నెలల మధ్య కాలాన్ని రొయ్యలు,చేపలు సంతానోత్పత్తికి గుడ్లు పెట్టే కాలంగా ప్రభుత్వం గుర్తించింది. ఈ కాలంలో వేటను సాగిస్తే గుడ్లు వలలకు చిక్కుకుని మత్య్స సంపద తగ్గే ప్రమాదం ఉంది.కాబట్టి ఈ రెండు నెలల పాటు వేటను ఆపేయనున్నారు.ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమించి ఎవరైనా ఈ రెండు నెలల్లో వేట సాగిస్తే జరిమానాతో పాటు బోటు రిజిస్ట్రేషన్‌ ఏడాది పాటు రద్దు చేస్తామని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్‌ హెచ్చరించారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకంలో భాగంగా రూ.20వేలు అందిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మెకనైజ్ట్‌, మోటరైజ్డ్‌ బోట్ల వివరాలను నమోదు చేసుకున్న యంత్రాంగం ఈ నెలాఖరుకు వారికి సొమ్ము అందజేయనుంది.వేట ఆగిపోవడంతో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ఇళ్లకు చేరుకున్నారు. తమ పడవలను సముద్ర తీరంలో భద్రపరచుకున్నారు. మత్స్యకార భరోసా నిధులు మంజూరైన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు.

సముద్ర తీరం పొడవు: 53.97 కి.మీ

తీర ప్రాంత మండలాలు: 3

మత్స్యకార గ్రామాలు: 27

మత్సక్యారుల సంఖ్య: 21,500

వేట సాగించే కుటుంబాలు:3,600

వేట సాగించే బోట్లు :674

Updated Date - Apr 15 , 2026 | 02:00 AM