శుభకార్యాలకు విరామం
ABN , Publish Date - May 15 , 2026 | 12:53 AM
బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు గురువారం నుంచి మూగబోయాయి. కల్యాణ మండపాలు బోసిపోయాయి. పురోహితులు పంచాంగాలు చుట్టేశారు. షామియానాలు, అలంకరణ సామగ్రిని యజమానులు అటకెక్కించేశారు.
నెల రోజుల పైబడి ముహూర్తాలకు బ్రేక్
అధిక జ్యేష్ట మాసం రాక
కలికిరి, మే 14 (ఆంధ్రజ్యోతి): బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు గురువారం నుంచి మూగబోయాయి. కల్యాణ మండపాలు బోసిపోయాయి. పురోహితులు పంచాంగాలు చుట్టేశారు. షామియానాలు, అలంకరణ సామగ్రిని యజమానులు అటకెక్కించేశారు. వంటవాళ్లు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఫిబ్రవరి నుంచి మే 13 వరకూ తెలుగు లోగిళ్లను వివిధ రకాల శుభకార్యాలతో కళకళలాడించిన ముహూర్తాలు నెల రోజల పైబడి సెలవు తీసుకుంటున్నాయి. గురువారం నుంచి మూడు రోజులు ముహూర్తాలు లేక ఎలాంటి శుభకార్యాలకు అవకాశం లేకుండా పోయింది. అనంతరం ఆదివారం నుంచి అధిక జ్యేష్ట మాసం రానుంది. ఈ కారణంగా జూన్ 20 వరకూ ఎలాంటి మంచి రోజులు లేవని పురోహితులు చెపుతున్నారు. అనంతరం జూన్‌లో చివరి 8 రోజులు మంచి ముహూర్తాలున్నాయని పండితులు వివరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఐదు వారాలపాటు వివాహాలు, గృహ ప్రవేశాలు, అద్దె ఇళ్ల మార్పు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడానికి అనువైన ముహార్తాలు లేనని కూడా పండితులు చెబుతున్నారు. అనంతరం జూన్‌లో 8 రోజులు, జూలైలో మరో నాలుగు రోజుల మాత్రమే ముహూర్తాలున్నాయిని, ఆ తర్వాత చతుర్మాసం తదితర కారణాలతో ఆగస్టులో 11 రోజులు, సెప్టెంబరులో 4, అక్టోబరులో మరో 4 రోజులు మాత్రం ముహూర్తాలున్నా చతుర్మాసం కూడా అడ్డొస్తోందని పురోహితులు అంటున్నారు. నవంబరులో కార్తీక మాసం కారణంగా 11 రోజులు, డిసెంబరులో మరో 14 రోజుల్లో కూడా అనువైన ముహూర్తాలున్నాయంటున్నారు.