Share News

మహిళలకు వరం.. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:53 AM

తొలి దశలో 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా నేడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

మహిళలకు వరం.. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

చిత్తూరు రూరల్‌, ఆంధ్రజ్యోతి: గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌తో జిల్లాలో ఏటా వందల మంది మహిళలు మృత్యువాత పడుతున్నట్లు సమాచారం. ఈ మరణాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణకు హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌) వ్యాక్సిన్‌ను మహిళలందరికీ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. తొలి దశలో 14 ఏళ్ల బాలికలకు వ్యాక్సిన్‌ అందించనున్నారు. ఈ ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని శనివారం సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ వ్యాక్సిన్‌ నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్లను నిరోధిస్తుంది. హెచ్‌పీవీ టైప్‌ 6, 11, 16, 18 రకాల నుంచి రక్షణ కల్పిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.

వైరస్‌ ఎలా వ్యాపిస్తుందంటే..

హెచ్‌పీవీ వైరస్‌ సురక్షితం కాని లైంగిక చర్యలతో సులభంగా వ్యాపిస్తుంది. అలాగే హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ ఉన్నవారిలో లేదా వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్నవారిలో వైరస్‌ వ్యాపిస్తుంది. చిన్న వయస్సులో గర్భధారణ, ఎక్కువ మంది పిల్లలను కనడం ఈ వైరస్‌ వ్యాప్తికి కారణమని వైద్యులు చెబుతున్నారు. పొగతాగడం వల్ల కూడా క్యాన్సర్‌ ప్రమాదం పెరుగుతుంది. ఈ క్యాన్సర్‌ 20 ఏళ్ల పైబడిన వారిలో ఎప్పుడైనా రావచ్చు. 35-44 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో ఎక్కువగా బయటపడుతుంది. 9-14 ఏళ్లలోపు బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయించుకోవడం ఉత్తమమని వైద్యులు అంటున్నారు. ఈ కారణంగానే ప్రభుత్వం ముందుగా 14 ఏళ్ల వారికి మొదట వ్యాక్సిన్‌ ఇవ్వనుంది.

పేదలకు వరం..

సర్వైకల్‌ క్యాన్సర్‌పై కొందరిలో అవగాహన ఉన్నా.. నివారణ కోసం తీసుకునే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ధర ఖరీదైంది కావడంతో పేదలు వెనకడుగు వేస్తున్నారు. 15 ఏళ్లలోపు బాలికల కోసం ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న గార్డాసిల్‌-4 టీకాను రెండు డోసుల్లో తీసుకోవాలి. ఒక్కో డోసు ధర రూ.3300 నుంచి రూ.4000 వరకు ఉంది. 15 ఏళ్లలోపు వారికి రెండు డోసులు, 15 ఏళ్ల పైబడిన వారికి మూడు డోసులు తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ ఉచితంగా ఇవ్వనుండటం పేదలకు వరమనే చెప్పాలి.

18,500 మందికి బాలికలకు లబ్ధి

జిల్లాలో 14 ఏళ్ల బాలికలు సుమారు 18,500 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డేటాను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. దీనికి అనుగుణంగా వ్యాక్సిన్‌ను జిల్లాకు సరఫరా చేయనున్నారు. అయితే ఏ కంపెనీ ఇస్తారో, ఎన్ని డోసులు ఇస్తారనే విషయం తెలియాల్సి ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

4,185 మంది క్యాన్సర్‌ అనుమానితులు

జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్‌సీడీ సర్వే ద్వారా 4185 మందికి సర్వైకల్‌ క్యాన్సర్‌ అనుమానితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో 140 మందికి క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్లు సమాచారం.

Updated Date - Feb 28 , 2026 | 01:53 AM