రక్తపు మరకలైనా ఆరకనే చలిలో రోడ్డు పక్కన పసికందు
ABN , Publish Date - Jan 10 , 2026 | 02:08 AM
చిమ్మ చీకటి.. వాలిన మంచు తెరలు.. గడ్డకట్టేంత చలి.. కేరు కేరు మంటూ పసిబిడ్డ ఏడుపు.. అలలు అలలుగా వినిపిస్తున్న ఈ ఏడుపు ఒక తల్లిని నిద్రలేపింది. చలికి వణుకుతూనే బయటకు వచ్చి చూస్తే రోడ్డువారన మంచుకి తడిచి ముద్దలా పడివున్న పసికందు. అప్పుడే అమ్మ కడుపులోంచి జారినట్టుగా ఒంటి మీద ఇంకా ఆరని ఉమ్మనీరు. చర్మాన్ని వీడని పలుచటి తెల్లని పొర. నెత్తుటి మరకలు.. చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. అయ్యో.. బిడ్డా అంటూ జవురుకుని గుండెలకు అదుముకుంది.
మదనపల్లె అర్బన్, జనవరి 9(ఆంధ్రజ్యోతి): చిమ్మ చీకటి.. వాలిన మంచు తెరలు.. గడ్డకట్టేంత చలి.. కేరు కేరు మంటూ పసిబిడ్డ ఏడుపు.. అలలు అలలుగా వినిపిస్తున్న ఈ ఏడుపు ఒక తల్లిని నిద్రలేపింది. చలికి వణుకుతూనే బయటకు వచ్చి చూస్తే రోడ్డువారన మంచుకి తడిచి ముద్దలా పడివున్న పసికందు. అప్పుడే అమ్మ కడుపులోంచి జారినట్టుగా ఒంటి మీద ఇంకా ఆరని ఉమ్మనీరు. చర్మాన్ని వీడని పలుచటి తెల్లని పొర. నెత్తుటి మరకలు.. చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. అయ్యో.. బిడ్డా అంటూ జవురుకుని గుండెలకు అదుముకుంది. ఈలోగా కొందరు పోగయ్యారు. ఎవరు.. ఎవరు.. ఎవరీ పసిమొగ్గ? తెల్లగా అందంగా ఉన్న ఆడబిడ్డని ఎవరు వదిలేశారు? తల్లిని నిందించారు కొందరు. ఆ తల్లికి ఏ కష్టం వచ్చి ఈ పేగు తెంచుకున్నదో అని దుఃఖించారు మరికొందరు. చలికి వీధికుక్కలన్నీ ముణగదీసుకుని పడుకోబట్టి కానీ లేకపోతే ఈ పసి ప్రాణం ఏమైపోయివుండేదో అని తలచుకుని వణికిపోయారు ఇంకొందరు. మదనపల్లి బాలాజీ కాలనీలో రోడ్డు పక్కన శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఈ ఆడబిడ్డ దొరికింది. సుజాత అనే మహిళ బిడ్డను ఎత్తుకునింది. సమాచారం అందుకుని టూటౌన్ పోలీసు ఒకరు వచ్చారు. బిడ్డ తల్లి కోసం చుట్టూ విచారించినా లాభం లేకపోయింది. ఐసీడీఎస్, అంగన్వాడీ కార్యకర్త గంగాదేవికి బిడ్డను అప్పగించారు. ఆమె మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని నవజాత శిశువు విభాగంలో చేర్పించారు. డాక్టర్లు పసికందును పరీక్షించి వైద్య చికిత్సలు అందించారు. అనంతరం శిశు సంరక్షణ గృహశాఖాధికారులకు ఆడబిడ్డను అప్పగించారు. సీడీపీఓ నాగవేణి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కళావతి, మదనపల్లెలోని శిశు విహార గృహసూపరింటెండెంట్ రమాదేవి, మేనేజరు సుప్రియ, డాక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఈబిడ్డను గృహానికి చేర్చే పనికి చేదోడుగా నిలచారు.