99.5శాతం సర్ పూర్తి : కలెక్టరు
ABN , Publish Date - Jul 14 , 2026 | 02:07 AM
తిరుపతి జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం 99.5శాతం పూర్తయిందని కలెక్టరు వెంకటేశ్వర్ తెలిపారు.
రేణిగుంట/తిరుపతి(కలెక్టరేట్), జూలై 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం 99.5శాతం పూర్తయిందని కలెక్టరు వెంకటేశ్వర్ తెలిపారు.రేణిగుంట, తిరుపతి అర్బన్, రూరల్ మండలాల్లో సోమవారం సర్ ప్రక్రియను తనిఖీ చేసిన ఆయన మాట్లాడుతూ నేటితో ముగిసే ఈ ప్రక్రియను మిగిలిపోయిన ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2002 ఓటర్ల జాబితాతో లింక్ కాని వారి పేర్లను వెంటనే తొలగించబోమన్నారు. ఈనెల 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో పొందుపరుస్తామన్నారు.ఈనెల 21నుంచి ఆగస్టు 20వరకు క్లైయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు.తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడిన శరణార్థులను గుర్తించామని,ఎన్నికల సంఘం సూచించిన 11గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలని లేకుంటే వారి ఓటుహక్కు తొలగిస్తామని స్సష్టం చేశారు. కాగా ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ మంగళవారం సాయంత్రానికి పూర్తి కావాల్సిందేనని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని బీఎల్వోలకు కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు.
జిల్లాకు 7వ స్థానం
ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌లో తిరుపతి జిల్లాకు 7వ స్థానం దక్కింది.తిరుపతి జిల్లాలో సోమవారం సాయంత్రానికి 17,69,438మంది ఓటర్లకు గాను 17,66,712 మంది ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. ఇక 2,726ఎన్యుమరేషన్ ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక అన్‌ట్రేస్‌బుల్ ఓటర్లు జిల్లాలో 2,92,961మందిగా తేలారు.