8 రోడ్లకు 35 ఏళ్ల తర్వాత మహర్దశ
ABN , Publish Date - Sep 28 , 2026 | 01:21 AM
తిరుపతి పరిసరాల్లో ఎనిమిది రోడ్లకు దాదాపు 35 ఏళ్ల తర్వాత మహర్దశ పట్టనుంది. 18.5 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్లను రూ.190.89 కోట్లతో తుడా ఆధ్వర్యంలో నిర్మించనున్నారు.
తిరుపతి సెంట్రల్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుపతి పరిసరాల్లో ఎనిమిది రోడ్లకు దాదాపు 35 ఏళ్ల తర్వాత మహర్దశ పట్టనుంది. 18.5 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్లను రూ.190.89 కోట్లతో తుడా ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. ఇప్పటికే తుడా చైర్మన్ దివాకర రెడ్డి, వీసీ గోవిందరావు ఆదేశాలతో అధికారులు టెండర్లు కూడా పిలిచారు. మరోవైపు ఈ రోడ్లను ఆదివారం కార్యదర్శి శ్రీకాంత్‌బాబు, సీపీవో దేవికుమారి, ఎస్‌ఈ రవీంద్రయ్య, అధికారులతో కలిసి చైర్మన్ పరిశీలించి, పలు సూచనలిచ్చారు. ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ల అవసరాన్ని చైర్మన్ తెలియజేయగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిల్లో శెట్టిపల్ల్లె టౌన్‌షి్‌ప పరిధిలో 150 అడుగుల రోడ్డు, శెట్టిపల్లె టౌన్‌షి్‌ప నుంచి జాతీయ రహదారి దామినేడు జంక్షన్ వరకు, కరకంబాడి రోడ్డు నుంచి శెట్టిపల్లె టౌన్‌షి్‌ప వరకు బీటీ రోడ్డు నిర్మాణం, కోర్టు కాంప్లెక్సు రోడ్డు జంక్షన్ నుంచి తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పరిధిలోని పూడి వరకు.. ఇలా దాదాపు ఎనిమిది రోడ్లు ఉన్నాయన్నారు. ఈ రోడ్లు పూర్తయితే తిరుపతితోపాటు చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల ప్రజల రాకపోకలు మరింత సౌకర్యంగా ఉంటుందన్నారు. అలాగే పద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు, వీఐపీలకు ట్రాఫిక్ కష్టాలూ తొలగనున్నాయని చెప్పారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడకుండా ఆరు నెలల వ్యవధిలోనే రోడ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. భూసేకరణ అధికారి సుజన, జేపీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.