Share News

4 కీలక ప్రాజెక్టులకు 76.34 ఎకరాలు

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:29 AM

జిల్లాకు సంబంధించిన నాలుగు కీలక ప్రతిపాదనల్ని మంత్రివర్గం ఆమోదించింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నాలుగు ప్రాజెక్టులకు 76.34 ఎకరాలను మార్కెట్‌ రేటుకు ఆయా సంస్థలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

4 కీలక ప్రాజెక్టులకు 76.34 ఎకరాలు

మార్కెట్‌ రేటుకు కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం

చిత్తూరు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు సంబంధించిన నాలుగు కీలక ప్రతిపాదనల్ని మంత్రివర్గం ఆమోదించింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నాలుగు ప్రాజెక్టులకు 76.34 ఎకరాలను మార్కెట్‌ రేటుకు ఆయా సంస్థలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

జీడీనెల్లూరులో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌

గంగాధరనెల్లూరు మండలం చిన్నవేపంజేరి రెవెన్యూ గ్రామంలోని మహాదేవమంగళం సీడ్‌ మల్టిప్లికేషన్‌ ఫార్మ్‌లో వ్యవసాయ శాఖకు చెందిన 46.69 ఎకరాల భూమిని పీఎం కుసుమ్‌ పథకం కింద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేటాయించారు. నెడ్‌క్యా్‌పకు 30 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది.

శాంతిపురంలో ఇండస్ట్రియల్‌ పార్కు విస్తరణ

శాంతిపురం మండలం సాతు గ్రామంలో సర్వే నెంబరు 83/2ఈలోని 4.94 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి కేటాయించారు. ఇప్పటికే అక్కడ ఏపీఐఐసీ భూమి ఇండస్ర్టియల్‌ పార్కు కోసం కేటాయించగా, దీని విస్తరణ కోసం అదనంగా 4.94 ఎకరాలను కేటాయించారు. మార్కెట్‌ విలువ ఎకరాకు రూ.12,38,930 చొప్పున మొత్తం భూమి విలువ రూ.61,20,341 చెల్లింపుపై కేటాయించనున్నారు.

వి.కోటలో హెచ్‌పీ పంపింగ్‌ స్టేషన్‌

వి.కోట మండలం తోటకనుమ గ్రామంలోని సర్వే నెంబరు 519/5లో 11.96 ఎకరాల ప్రభుత్వ భూమిని హిందూస్థాన్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)కు కేటాయించారు. ఇక్కడ ఇంటర్మీడియట్‌ పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మార్కెట్‌ విలువ రూ.8 లక్షల చొప్పున చెల్లింపుపై కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదించింది.

గుడుపల్లెలో ఇండస్ట్రియల్‌ పార్కు

గుడుపల్లె మండలం లింగాపురం దిన్నె గ్రామంలోని సర్వే నెంబరు 50/5లో 12.75 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి కేటాయించారు. ఇక్కడ ఇండస్ర్టియల్‌ పార్కు ఏర్పాటు కోసం మార్కెట్‌ విలువ రూ.12 లక్షల చొప్పున చెల్లింపుపై కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Updated Date - Jun 05 , 2026 | 12:30 AM