272 పంచాయతీల్లో 70.56 శాతం పోలింగ్
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:14 AM
తిరుపతి జిల్లాలో గురువారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.రైల్వే కోడూరు నియోజకవర్గంలో మాత్రమే చెదురుమదురు ఘటనలు చోటుచేసుకోగా మిగిలిన శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదు.
పెనగలూరులో ఈవోపీఆర్డీపై దాడికి యత్నం
తిరుపతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో గురువారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.రైల్వే కోడూరు నియోజకవర్గంలో మాత్రమే చెదురుమదురు ఘటనలు చోటుచేసుకోగా మిగిలిన శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదు. మొదటి విడత 404 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా 136 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.నాలుగు పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా వార్డులకు మాత్రం ఎన్నికలు జరిగాయి.మొత్తం 272 పంచాయతీలకు గురువారం పోలింగ్ జరిగింది. 4.42 లక్షలమంది ఓటర్లకు గానూ 3.12 లక్షల ఓట్లు పోలయ్యాయి. పురుషుల మొత్తం ఓట్లు 2.15 లక్షలు కాగా 1.51 లక్షలమంది ఓట్లు వేశారు. అలాగే 2.27 లక్షల మహిళా ఓటర్లలో 1.61 లక్షలమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మీద 70.56 శాతం పోలింగ్ జరిగింది. అత్యధికంగా చిట్వేలి మండలంలో 86.06 శాతం పోలింగ్ జరిగితే అత్యల్పంగా రైల్వే కోడూరు మండలంలో 50.89 శాతం పోలింగ్ నమోదైంది.
వైసీపీ దాడిలో టీడీపీ కార్యకర్తకు గాయాలు
ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో వైసీపీకి చెందినవారు బయటి ప్రాంతాల నుంచి సుమారు 40 మంది యువకులను రప్పించడంపై కూటమి వర్గీయులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వారిలో ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.ఓబులవారిపల్లె మండల పరిధిలోని మంగంపేట పంచాయతీ ఆర్‌ఆర్-1 పోలింగ్ కేంద్రంలో తమ పార్టీ మద్దతుదారైన పోలింగ్ ఏజెంట్‌ను బయటకు నెట్టేశారని ఆరోపిస్తూ టీడీపీ వర్గీయులతో వైసీపీ వర్గీయులు గొడవకు దిగారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీ కార్యకర్త ఒకరు గాయపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలనూ చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
పెనగలూరులో ఈవోపీఆర్డీపై దాడికి యత్నం
పెనగలూరులో ఈవోపీఆర్‌డీ శ్రీకాంత్‌పై దాడికి యత్నం జరిగింది.ఒకటి, రెండు వార్డుల బ్యాలెట్లను లెక్కించే సమయంలో వైసీపీ బలపరుస్తున్న శంకరపు భాగ్యలక్ష్మికి అనుకూలంగా బ్యాలెట్ కట్టలను తయారు చేస్తున్నారని బయటకు తెలియడంతో విషయం తెలుసుకున్న టీడీపీ వర్గీయులు ఈవోఆర్డీని బయటకు పంపించాలని పట్టుబట్టారు.ఆయన బయటకు రాగానే ద్రోహపు చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారంటూ దాడికి యత్నించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగిందిఎన్నికల సిబ్బందికి సహకారం అందించేందుకే లోపలకు వెళ్లినట్లు శ్రీకాంత్ తెలిపారు.అయితే ఎంపీడీవో మోహన్‌ను వివరణ కోరగా ఎన్నికల ప్రక్రియ అంతా ఆర్వో, ఏఆర్వో, పీవో, ఏపీవోలు చూసుకుంటారని, ఈవోఆర్డీకి అక్కడికి వెళ్లే అధికారం లేదన్నారు.
జనసేన వర్గ విభేదాలతో పోలింగ్ బహిష్కరణ
పుల్లంపేట మండలం జనసేన పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలతో ఎగువరెడ్డిపల్లెవాసులు పోలింగ్‌ను బహిష్కరించి రోడ్డెక్కారు. టి.కమ్మపల్లె పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఎగువరెడ్డిపల్లెకు చెందిన వారిని ఏజెంట్లుగా అనుమతించలేదని ఆరోపిస్తూ ఆ గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. కడప-తిరుపతి జాతీయ రహదారిపై బైఠాయించారు. అక్కడ రెండు వర్గాలూ జనసేన పార్టీ మద్దతుదారులే కావడం గమనార్హం. వివాదం కారణంగా ఎగువరెడ్డిపల్లెకు చెందిన సుమారు 120 మంది గ్రామస్తులు ఓటింగ్‌లో పాల్గొనలేదు.
కూటమి జోరు
140 సర్పంచ్ స్థానాల్లో కూటమి మద్దతుదారుల గెలుపు
61 చోట్ల వైసీపీ మద్దతుదారుల విజయం
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో పాటు గురువారం జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీల మద్దతుదారుల జోరు స్పష్టంగా కనిపించింది. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో 305 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా అందులో కూటమి పార్టీలకు అనుకూలురైన అభ్యర్థులు ఏకంగా 140 సర్పంచ్ స్థానాలను గెలుపొందారు. వాటిలో టీడీపీ మద్దతుదారులు 135 సర్పంచు పదవులను కైవసం చేసుకోగా జనసేన నాలుగింటిని, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. వైసీపీ మద్దతుదారులు 61 సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నారు. తటస్తులు నాలుగు చోట్ల విజయం సాధించారు. కాగా ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 305 సర్పంచ్ పదవులకు గానూ మహిళలు అత్యధికంగా 165 సర్పంచ్ పదవులను కైవసం చేసుకోగా పురుష అభ్యర్థులు 140 పదవులను దక్కించుకున్నారు.