Share News

7 గంటలు.. సీఎం బిజీ బిజీ

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:13 AM

గురువారం సంక్రాంతి సందర్భంగా సీఎం ఏడు గంటలు బిజీగా గడిపారు.

7 గంటలు.. సీఎం బిజీ బిజీ

తిరుపతి(కలెక్టరేట్‌), జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు తన సొంతూరైన నారావారిపల్లెలో గురువారం సంక్రాంతి సందర్భంగా ఏడు గంటలు బిజీగా గడిపారు. కుటుంబసభ్యులతో కలిసి ఉదయం 10.40 గంటలకు గ్రామదేవత దొడ్డి గంగమ్మను దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. నాగాలమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 12గంటలకు తల్లిదండ్రులు ఖర్జూరనాయుడు, అమ్మణమ్మ, సోదరుడు రామమూర్తినాయుడు సమాధుల వద్ద దుస్తులు పెట్టి, కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. 12.30 గంటలకు ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌, నారా ఇందిర, నారా రోహిత్‌, సిరిలిల్లా దంపతులు, నందమూరి రామకృష్ణ, లోకేశ్వరి, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌ దంపతులు పాల్గొన్నారు.

శ్రీవారి ప్రసాదాల అందజేత

సీఎం చంద్రబాబు దంపతులకు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, అడిషనల్‌ ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, వేదపండితులు స్వామివారి ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. సీఎం దంపతులకు వేదాశీర్వచనం చేశారు.

1,600 మంది నుంచి వినతులు స్వీకరణ

మధ్యాహ్నం 12.40 గంటలకు ఇంటి వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబు.. అర్జీలతో క్యూలైన్లలో ఉన్న ప్రతి ఒక్కరిని పలకరించారు. అర్జీలు స్వీకరించారు. చిన్న పిల్లలతో సెల్ఫీ దిగారు. గత మూడు రోజులు సుమారు 1,600 అర్జీలను స్వీకరించారు. వాటిని నారావారిపల్లె స్పెషల్‌ ఆఫీసర్‌ డీపీవో సుశీలాదేవికు అప్పగించారు. ఆమె వాటిని పీజీఆర్‌ఎస్‌ విభాగానికి పంపించి ఆన్‌లైన్‌ చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన అర్జీలను ఆయా జిల్లాల అధికారులకు పంపనున్నారు. ఇంటి నుంచి 3.50 గంటలకు బయలుదేరి రంగంపేటలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్‌మోహన్‌, మురళీమోహన్‌, బొజ్జల సుధీర్‌రెడ్డి, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహయాదవ్‌, ఏపీ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సుగుణమ్మ, తుడా చైర్మన్‌ డాలర్‌ దివాకర్‌రెడ్డి, శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు, డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావు, ట్రైనీ కలెక్టర్‌ సందీప్‌ రఘువంశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ పనితీరు భేష్‌

‘స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు విజయవంతంలో మీ పనితీరు భేష్‌. ఇదే తరహాలో స్వర్ణచంద్రగిరి మండలాన్ని అభివృద్ధిచేయండి’ అంటూ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, స్పెషల్‌ ఆఫీసర్‌(డీపీవో) సుశీలాదేవి, వారి బృందాన్ని గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి వీరితో ఆయన సమీక్షించారు. ఇక, గురువారం రాత్రి కూడా ‘స్వర్ణ నారావారిపల్లె’ ప్రాజెక్టు అమలుతో ఏడాదిలోనే మంచి ఫలితాలు వచ్చాయని ‘ఎక్స్‌’ వేదికగా సీఎం అభినందించారు. ‘అన్ని ఇళ్లకు సోలార్‌ ప్యానెళ్లు అమర్చడం, శాస్త్రీయ పద్ధతిలో పాడి పరిశ్రమను ప్రోత్సహించడం, ప్రకృతిసేద్యం విస్తరణ ద్వారా స్థానికులకు తలసరి ఆదాయం 20 శాతం మేర పెరిగింది. ఇదే స్ఫూర్తితో చంద్రగిరి మండలమంతటా ఈ ప్రాజెక్టును విస్తరించాలి. ఏడాదిలోపు నిర్దేశిత ఫలితాలు సాధించాలి’ అని పేర్కొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 12:13 AM