హెచ్‌ఏఎం నిధుల్లో చిత్తూరుకు రూ.60 కోట్లు
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:36 AM
కుప్పం నుంచి సీఎం చంద్రబాబు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 123 నగర, పురపాలక సంఘాల్లో అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
చిత్తూరు అర్బన్, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): కుప్పం నుంచి సీఎం చంద్రబాబు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 123 నగర, పురపాలక సంఘాల్లో అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అందులో చిత్తూరు నగరానికి సంబంధించి రూ.60 కోట్లతో చేపట్టనున్న పనులున్నాయి. సీఎం ఆవిష్కరణ సమయంలో.. నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ తదితరులు నేరుగా పాల్గొని శిలాఫలకాలను ఆవిష్కరించారు. పట్టణాలు, నగరాలను అభివృద్ధిని ఉద్దేశించిన ఈ హెచ్‌ఏఎం కార్యక్రమం కింద చిత్తూరులో రూ.60 కోట్లతో రోడ్లు, వీధి దీపాలు, కాలువలు వంటి పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల మాట్లాడుతూ.. చిత్తూరు నగర సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటి వరకు మొత్తం 404.42 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. ఇందులో రూ.164.42 కోట్లతో చేపట్టన పనులు వివిధ దశల్లో ఉండగా... మరో రూ.240 కోట్లకు పరిపాలన అనుమతులు వచ్చాయన్నారు. గత వైసీపీ హయాంలో నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తప్పుడు మాటలతో వచ్చేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ అముద, టీడీపీ నగర అధ్యక్షుడు వరుణ్‌కుమార్, నేతలు రాజే్‌షకుమార్‌రెడ్డి, గోపాలకృష్ణ, అట్లూరి శ్రీనివాసులు, వెంకటేశ్ యాదవ్, పుష్ప, లీలావతి తదితరులు పాల్గొన్నారు.