500 మొబైల్ ఫోన్ల రికవరీ
ABN , Publish Date - May 20 , 2026 | 02:18 AM
జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో 14వ విడతలో భాగంగా సుమారు రూ.కోటి విలువైన 500 సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం మీడియాకు ఎస్పీ సుబ్బరాయుడు వివరాలను తెలియజేశారు. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన 13 దశల్లో రూ.10,52,70,000 విలువజేసే 4,785 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, బాధితులకు అప్పగించారు.
తిరుపతి(నేరవిభాగం), మే 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో 14వ విడతలో భాగంగా సుమారు రూ.కోటి విలువైన 500 సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం మీడియాకు ఎస్పీ సుబ్బరాయుడు వివరాలను తెలియజేశారు. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన 13 దశల్లో రూ.10,52,70,000 విలువజేసే 4,785 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, బాధితులకు అప్పగించారు. మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళల్లోనూ ట్రాక్ చేసి మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఇంటినుంచే సీఈఐఆర్ సేవల ద్వారా ఫిర్యాదు నమోదు చేసి ఫోన్‌ను తిరిగి పొందే అవకాశం కల్పిస్తున్నారు. తిరుపతి సైబర్ క్రైమ్ సీఐ ఆర్.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మొబైల్ ట్రాకింగ్, రికవరీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహిస్తోందని ఎస్పీ ప్రశంసించారు. ఏఎస్పీ వెంకటరావు, సిబ్బంది పాల్గొన్నారు.
వినియోగదారులకు సూచనలు
వినియోగదారులకు ఎస్పీ పలు సూచనలిచ్చారు. మొబైల్ పోగొట్టుకున్నవారు 94906 17873 నెంబరు వాట్సా్‌పకు హాయ్ అని మెసేజ్ పంపితే సీఈఐఆర్ లింక్ వస్తుంది. ఆ లింక్‌ద్వారా సమాచారాన్ని పూరిస్తే ఫిర్యాదు నమోదు అవుతుంది. మొబైల్ పోయిన వెంటనే సిమ్ బ్లాక్ చేయించుకోవాలి. ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌లకు బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలి. అపరిచితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయొద్దు.