Share News

జిల్లాలో 4వ విడత రీసర్వే ప్రారంభం

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:25 AM

వైసీపీ హయాంలో చేపట్టిన రీసర్వేలో భారీగా తప్పులు దొర్లాయి.

జిల్లాలో 4వ విడత రీసర్వే ప్రారంభం
రీసర్వేచేస్తున్న అధికారులు, సిబ్బంది

తిరుపతి(కలెక్టరేట్‌), జనవరి 6(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో చేపట్టిన రీసర్వేలో భారీగా తప్పులు దొర్లాయి. భూవివాదాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూవివాదాలతో రైతులు, అధికారులు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భావితరాలకు నిర్ధిష్టమైన హక్కు పత్రాలు అందజేసే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రీసర్వే ప్రారంభించింది. గతప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వేలో పొరబాట్లు, తప్పులు పునరావృతం కాకుండా ఈసారి అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కా కొలతలతో భూములను గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదుచేసేలా రీసర్వే చేపట్టారు. తిరుపతి జిల్లాలో 4వ విడత భూరీసర్వే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. 163 రెవెన్యూ గ్రామాల్లో 2,17,677ఎకరాల్లో భూరీసర్వే అధికారులు చేపట్టారు. జిల్లాలో గతంలో 34 మండలాలు ఉండేవి. అందులో గూడూరు డివిజన్‌లోని గూడూరు, చిల్లకూరు, కోట మండలాలు నెల్లూరు జిల్లాలో విలీనమయ్యాయి. అయితే జిల్లా పునర్విభజనలో భాగంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మరో ఐదు మండలాలు కలవడంతో తిరుపతి జిల్లాలో మండలాల సంఖ్య 36కు చేరింది. అందులో భాగంగా 4వ విడతలో సోమవారం నుంచి రీసర్వే ప్రారంభమైంది. బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి, కేవీబీపురం, నాగలాపురం, పిచ్చాటూరు, రేణిగుంట, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, చిట్టమూరు, వాకాడు, బీఎన్‌కండ్రిగ, డీవీ సత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు, సత్యవేడు, సూళ్లూరుపేట, తడ, వరదయ్యపాళెం, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, పాకాల, పుత్తూరు, ఆర్‌సీపురం, తిరుపతి రూరల్‌, చిట్వేల్‌, కోడూరు, ఓబులవారిపల్లి, పెనగలూరు, పుల్లంపేటలో 4వ విడత రీసర్వే ప్రారంభమైంది. నాలుగవ విడతగా 163 గ్రామాల్లో కలిపి భూవిస్తీర్ణం దాదాపు 2,17,677 ఎకరాలు. ఇందులో గవర్నమెంట్‌ ల్యాండ్‌ 86,229 ఎకరాలు, పట్టాల్యాండ్‌ 1,32,353 ఎకరాలు. ఇప్పటికే ప్రభుత్వ భూమి సర్వే పూర్తికావడంతో ఇప్పుడు రైతుల భూములకు సర్వే చేపట్టారు. గత ప్రభుత్వం హయాంలో 320రెవెన్యూ గ్రామాల్లో 2,30,137 ఎకరాల్లో రీసర్వే చేశారు. ఇందులో అనేక తప్పులు చోటు చేసుకోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. వైసీపీతీరుతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సరికొత్త టెక్నాలజీతో డిసెంబరు చివరినాటికి మూడు విడతల్లో భూరీసర్వే పూర్తి కాగా 433 రెవెన్యూ గ్రామాల్లో 3,13,780 ఎకరాల్లో రీసర్వే పూర్తయింది. అందులో ప్రభుత్వం భూములు 1,39,902 ఎకరాలు, పట్టాభూములు 1,73,887 ఎకరాల్లో రీసర్వే పూర్తయింది.

Updated Date - Jan 07 , 2026 | 01:25 AM