39.6 కిలోల గంజాయి సీజ్
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:29 AM
కారులో తరలిస్తున్న 39.6 కిలోల గంజాయిని (విలువ రూ.11.88 లక్షలు) బుధవారం యాదమరి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో డీఎస్పీ వెంకటనారాయణ, సీఐ శ్రీధర్‌నాయుడు, ఎస్‌ఐ ఈశ్వరరావుతో కలిసి నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు వెల్లడించారు.
ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్టు
అక్రమ రవాణాకు వీలుగా కారులో మార్పులు
చిత్తూరు అర్బన్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): కారులో తరలిస్తున్న 39.6 కిలోల గంజాయిని (విలువ రూ.11.88 లక్షలు) బుధవారం యాదమరి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో డీఎస్పీ వెంకటనారాయణ, సీఐ శ్రీధర్‌నాయుడు, ఎస్‌ఐ ఈశ్వరరావుతో కలిసి నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు వెల్లడించారు. ఆ ప్రకారం.. యాదమరి మండలం వరిగిపల్లె జంక్షన్‌లోని బాన్స్ హోటల్ సర్వీస్ రోడ్డులో గంజాయి రవాణా జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసు సిబ్బందితో పాటు డీటీ జయంతి కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన కారును ఆపారు. అందులోని ఒడిశా రాష్ట్రం మాల్కన్‌గిరి జిల్లా దీక్షిత్ సుప్రీత్, కోరాపుట్ జిల్లాకు చెందిన మురళీధర్ బురిడీ(33)ని అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారయ్యాడు. కారును తనిఖీ చేయగా రూ.11.88 లక్షల విలువ చేసే 39.6 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారు, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి జిల్లా మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. అక్కడ కిలో గంజాయి రూ.30వేలు ఉంటుందని తెలిపారు. గంజాయి రవాణాలో పరారైన నిందితుడితో పాటు మరి కొందరి ప్రమేయమున్నట్లు గుర్తించామని, వారినీ త్వరలో పట్టుకుంటామని రాజశేఖర్‌రాజు తెలిపారు. యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి.. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు. యువత భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు సంబంధించి సమాచారం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, వీరి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.
కారులో మార్పులు చేశారిలా..
సాధారణంగా గంజాయిని రైళ్లలో లేదా కారు, ద్విచక్రవాహనాల్లో చిన్నపాటి బ్యాగులు, గోతాల్లో తీసుకెళుతుంటారు. కానీ, యాదమరి పోలీసులకు పట్టుబడన దొంగలు మాత్రం పుష్ప లెవల్‌లో గంజాయి తరలిస్తున్నారు. కారులో సీటు కింది భాగంలో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి ప్యాకెట్లు పట్టేలా ఇనుప ప్లేట్లతో తయారు చేశారు. వెనుక డిక్కీ కింది భాగంలో ప్లాట్‌గా ఇనుప ప్లేట్లతో తయారు చేసి వాటిలోపల గంజాయి ఉంచారు. పోలీసులకు కచ్చితమైన సమాచారం ఉండటంతో అణువణువు పరిశీలించి గంజాయిని పట్టుకున్నారు. లేదంటే గంజాయి దొరికేది కాదు.