Share News

35 జడ్పీటీసీ స్థానాలకు 386 నామినేషన్లు

ABN , Publish Date - Oct 24 , 2026 | 01:17 AM

జిల్లావ్యాప్తంగా జడ్పీటీసీ స్థానాలకు చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 35 జడ్పీ స్థానాలకు తొలి రోజు 51, రెండో రోజు 122 చొప్పున నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజైన శుక్రవారం ఏకంగా 213 నామినేషన్లు వచ్చాయి.

35 జడ్పీటీసీ స్థానాలకు 386 నామినేషన్లు
ప్రైవేట్‌ సెక్యూరిటీని ప్రశ్నిస్తున్న పోలీసులు

డీఆర్డీఏ కార్యాలయంలో నేడు పరిశీలన

తిరుపతి/తిరుచానూరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా జడ్పీటీసీ స్థానాలకు చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 35 జడ్పీ స్థానాలకు తొలి రోజు 51, రెండో రోజు 122 చొప్పున నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజైన శుక్రవారం ఏకంగా 213 నామినేషన్లు వచ్చాయి.మొత్తం 386 నామినేషన్లలో టీడీపీ తరపున 169,వైసీపీ నుంచీ 136 దాఖలయ్యాయి. జనసేన పార్టీ తరపున 36 నామినేషన్లు పడగా బీజేపీ నుంచీ 12 వచ్చాయి. బీఎస్పీ నుంచీ 7, కాంగ్రెస్‌ పార్టీ తరపున 10, సీపీఎం నుంచీ 3, సీపీఐ తరపున ఒకటి, ఇతర పార్టీల నుంచీ 2 చొప్పున నామినేషన్లు దాఖలు కాగా ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 11 నామినేషన్లు దాఖలు చేశారు.తిరుపతిలోని డీఆర్డీఏ కార్యాలయంలో శనివారం జడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.నియోజకవర్గాలవారీగా....చంద్రగిరి నామినేషన్ల పరిశీలన ఉదయం 8నుంచీ 11 గంటల వరకూ జరగనుంది. రైల్వే కోడూరు నామినేషన్లను ఉదయం 11 నుంచీ మధ్యాహ్నం ఒక గంట నడుమ పరిశీలిస్తారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని వాకాడు, చిట్టమూరు జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన నామినేషన్లను మధ్యాహ్నం ఒక గంట నుంచీ ఒకటిన్నర గంట నడుమ స్ర్కూటినీ చేస్తారు. సూళ్ళూరుపేట నామినేషన్లను మధ్యాహ్నం 2 నుంచీ సాయంత్రం 4 నడుమ, సత్యవేడు నామినేషన్లను సాయంత్రం 4-5 గంటల నడుమ పరిశీలిస్తారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాల జడ్పీటీసీ స్థానాల నామినేషన్‌ పత్రాలను సాయంత్రం 5 నుంచీ 5.30 గంటల నడుమ స్ర్కూటినీ చేస్తారు. అదే విధంగా నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు, వడమాలపేట మండలాల జడ్సీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్‌ పత్రాలను సాయంత్రం 5.30 నుంచీ 5.45 మధ్య పరిశీలిస్తారు.చివరగా శ్రీకాళహస్తి నామినేషన్లను సాయంత్రం 5.45 నుంచీ రాత్రి 7 గంటల నడుమ పరిశీలించనున్నారు.జడ్పీటీసీ అభ్యర్థులు తమకు కేటాయించిన సమయాలను దృష్టిలో వుంచుకోవాలని రిటర్నింగ్‌ అధికారి శోభన్‌ బాబు తెలిపారు.

444 ఎంపీటీసీ స్థానాలకు 2949 నామినేషన్లు దాఖలు

జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలకు కూడా శుక్రవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.మొత్తం 444 ఎంపీటీసీ స్థానాలకు గానూ శుక్రవారం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 1517 నామినేషన్లు సమర్పించారు. గడువు ముగిసే సరికి మొత్తం మూడు రోజుల పాటు దాఖలైన నామినేషన్ల సంఖ్య 2949కు పెరిగింది. ఇందులో అత్యధికంగా టీడీపీ నుంచీ 1359 నామినేషన్లు దాఖలు కాగా ప్రధాన ప్రత్యర్థి వైసీపీ నుంచీ 1122 నామినేషన్లు వచ్చాయి. జనసేన పార్టీ తరపున అభ్యర్థులు 190 నామినేషన్లు సమర్పించగా బీజేపీ తరపున 65 నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున 16 నామినేషన్లు, సీపీఎం తరపున 24 నామినేషన్లు పడ్డాయి. బీఎస్పీ అభ్యర్థులు 11 నామినేషన్లు సమర్పించగా ఇతర పార్టీల నుంచీ 9 నామినేషన్లు వచ్చాయి. ఇక ఇండిపెండెంట్‌ అభ్యర్థుల నుంచీ 153 నామినేషన్లు దాఖలయ్యాయి. నేడు ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో నామినేషన్‌ పత్రాలను స్ర్కూటినీ చేయనున్నారు.

Updated Date - Oct 24 , 2026 | 01:17 AM