32 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:00 AM
కర్ణాటకకు అక్రమంగా తరలిపోతున్న 32 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు.
ఐదుగురి అరెస్ట్
రొంపిచెర్ల, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకకు అక్రమంగా తరలిపోతున్న 32 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో తిరుపతి-పీలేరు జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. అటువైపు వచ్చిన లారీలో 630 ప్లాస్టిక్ సంచుల్లో 32 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. లారీతో పాటు రెండు కార్లను సీజ్ చేశారు. శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన మొరవ బాలాజీ, నందిపట్ల శ్రీనివాసులు, ఎం.సతీష్, ఎస్‌కె.మహమ్మద్, దశరథరామయ్యలను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి, బియ్యాన్ని సివిల్ సప్లయ్స్ అధికారులకు అప్పగించారు. కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేట మార్కెట్‌కు బియ్యం తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.