Share News

16 రోజుల్లో 300 క్వింటాళ్ల విక్రయాలు

ABN , Publish Date - Oct 29 , 2026 | 01:19 AM

ప్రభుత్వం రాయితీతో ప్రవేశపెట్టిన బియ్యానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మదనపల్లె, పుంగనూరు, పీలేరు, రాయచోటిలోని రైతు బజార్లలో ఈ నెల 12న పౌరసరపరాలశాఖ ఈ కేంద్రాలను ప్రారంభించింది. పుంగనూరులో మూతపడగా మిగిలిన మూడు కేంద్రాలు నడుస్తున్నాయి.

16 రోజుల్లో 300 క్వింటాళ్ల విక్రయాలు
మదనపల్లెలో రాయితీ బియ్యానికి క్యూకట్టిన వినియోగదారులు

రాయితీ బియ్యానికి అనూహ్య స్పందన

మదనపల్లె కేంద్రానికి క్యూకట్టిన ప్రజలు

మదనపల్లె, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రాయితీతో ప్రవేశపెట్టిన బియ్యానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మదనపల్లె, పుంగనూరు, పీలేరు, రాయచోటిలోని రైతు బజార్లలో ఈ నెల 12న పౌరసరపరాలశాఖ ఈ కేంద్రాలను ప్రారంభించింది. పుంగనూరులో మూతపడగా మిగిలిన మూడు కేంద్రాలు నడుస్తున్నాయి. మదనపల్లె రైతు బజారులోని కేంద్రం జిల్లాలోనే ప్రథమస్థానంలో అమ్మకాలు చేపట్టి రికార్డు సృష్టిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగు, అందులోనూ ముఖ్యంగా వరిసాగుకు రైతులు ముందుకు రావడం లేదు. దీంతో మార్కెట్‌లో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలను నియంత్రించే క్రమంలో మొదట్లో రైస్‌ మిల్లర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభించగా, నెల రోజులకే అమ్మకాలు లేక మూతపడ్డాయి.

300 క్వింటాళ్లకు పైగా విక్రయాలు

పీలేరు, రాయచోటి రైతు బజార్లలో ఎన్నికల కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అమ్మకాలు మందగించినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. మదనపల్లెలో మాత్రం ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటివరకూ వినియోగదారులు క్యూ కడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో నాలుగు నెలల క్రితం 25 కిలోల బస్తా రకాన్ని బట్టి రూ.1,200 నుంచి రూ.1,500 ఉండేది. తర్వాత రూ.2వేలకుపై బడింది. దీంతో సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుంచి టెండర్ల ద్వారా కొనుగోలు చేసి, ఆయా కేంద్రాలకు సరఫరా చేస్తోంది. ధరణిబ్రాండ్‌ సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం 26 కిలోల బస్తా రూ.1,800 కొనగోలు చేసి, ప్రజలకు సబ్సిడీపై రూ.1,300 విక్రయిస్తోంది. కె.ఎన్‌.ఎం., ఆర్‌ఎన్‌ఆర్‌, బీపీటీ రకాలను రా రైస్‌గా స్టీమ్‌ రైస్‌గా కిలో రూ.49, రూ.50 చొప్పున విక్రయిస్తోంది. ధనికులే కాదు..సామాన్యులూ ఆహారం తినగలిగే మంచి, సన్నాలు రకం కావడంతో ప్రజలు ముందుకొస్తున్నారు. రైస్‌ కార్డు, ఆధార్‌కార్డు ఆధారంగా జారీ చేస్తుండగా ఇప్పటి వరకూ వెయ్యి మంది లబ్ధిదారులకు 300 క్వింటాళ్లకుపైగా అమ్మకాలు చేపట్టినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా డిమాండ్‌ను బట్టి కె.ఎన్‌.ఆర్‌, ఆర్‌.ఎన్‌.ఆర్‌ రకాన్ని కేవలం మదనపల్లెకే 1,900 బ్యాగులు, బీపీటీని 1,500 బ్యాగులు ఇండెంట్‌ ఇచ్చినట్లు కేంద్ర నిర్వాహకులు, సివిల్‌ సప్లయ్‌ డీటీ ఎన్‌.ఫిరోజ్‌ఖాన్‌ తెలిపారు.

Updated Date - Oct 29 , 2026 | 01:19 AM