ఎంపీటీసీ అభ్యర్థుల్లో 30శాతం మంది నిరక్షరాస్యులే!
ABN , Publish Date - Oct 30 , 2026 | 01:15 AM
ఎంపీటీసీ ఎన్నికల బరిలో ఎం.టెక్, ఎల్ఎల్ఎం, ఎంబీఏ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరోవైపు 2, 3 తరగతులు చదివిన వారితో పాటు నిరక్షరాస్యులూ ఎన్నికల బరిలో నిలిచారు.
2 నుంచి ఎం.టెక్ వరకు చదివిన వాళ్లుకూడా
చిత్తూరు రూరల్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ ఎన్నికల బరిలో ఎం.టెక్, ఎల్ఎల్ఎం, ఎంబీఏ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరోవైపు 2, 3 తరగతులు చదివిన వారితో పాటు నిరక్షరాస్యులూ ఎన్నికల బరిలో నిలిచారు. అభ్యర్థుల అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల ప్రకారం.. జిల్లాలోని ఎంపీటీసీ అభ్యర్థుల విద్యార్హతలలో దాదాపు 30 శాతం మంది నిరక్షరాస్యులుగా పేర్కొన్నారు. మరో 28 శాతం మంది పదో తరగతి వరకు చదివిన వారున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదివినవారు సుమారు 16 శాతం ఉన్నట్లు అంచనా. ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారు 11 శాతం, డిగ్రీ విద్యార్హత కలిగినవారు 12 శాతం వరకు ఉన్నారు. పీజీ, వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేసినవారు సుమారు మూడు శాతం మంది ఉన్నారు.
బరిలో ఎం.టెక్ చదివిన అభ్యర్థి
అభ్యర్థుల విద్యార్హతల్లో అత్యున్నతంగా చిత్తూరు రూరల్ మండలం పచ్చననపల్లి ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న వి.జీవన్ జ్యోతి ఎం.టెక్ పూర్తి చేశారు. జీడీనెల్లూరు మండలం వెల్కూరు నుంచి పోటీ చేస్తున్న ఎం. వర్ష ఎల్ఎల్ఎం చదివారు. భైరెడ్డిపల్లె మండలం కడపనత్తానికి చెందిన ఆర్.మైఖేల్, ఐరాల మండలం గుండ్లపల్లికి చెందిన ఎ.పరమశివయ్య, కార్వేటినగరం కత్తెరపల్లికి చెందిన ఎం.ధనశేఖర్, కొల్లగుంటకు చెందిన వీ నీది, కుప్పం కంగుంది-1కు చెందిన జి.ధనశేఖర్ ఎంబీఏ చదివారు. బైరెడ్డిపల్లె-2లో క్రిష్ణవేణి, బంగారుపాళ్యం మండలం కీరమందకు చెందిన సుబ్రమణ్యం, గుడుపల్లె మండలం శెట్టిపల్లికి చెందిన లక్ష్మీదేవి పీజీ విద్యార్హతలు కలిగి ఉన్నారు.
రెండో తరగతి చదివినవారూ..
తక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులూ ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. చీకురుపల్లికి చెందిన పి.రమణయ్య, గుడుపల్లెకి చెందిన ఎ.కళ మూడో తరగతి.. కార్వేటినగరం మండలం సీడీ కండ్రిగకు చెందిన ఎ.పి.గోవిందస్వామి, కొటార్వేడుకు చెందిన కె.సరళ రెండో తరగతి చదివినవారిగా జాబితాలో పేర్కొన్నారు. ఇక, ఎలాంటి చదువూ లేదని.. సంతకం మాత్రం పెట్టగలిగిన అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో పోటీలో ఉన్నారు.