సొంతింటికి 2832 మంది
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:40 AM
తెలుగుదేశం హయాంలో టిడ్కో ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులూ డిపాజిట్లు కట్టారు. ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్న సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వివిధ దశల్లోని టిడ్కో ఇళ్లను రద్దు చేసింది.
నేడు సామూహిక గృహప్రవేశాలు
వైసీపీ హాయంలో పంపిణీకి నోచుకోని టిడ్కో ఇళ్లు
కూటమి వచ్చాక నెరవేరుతున్న లబ్ధిదారుల కల
తెలుగుదేశం హయాంలో టిడ్కో ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులూ డిపాజిట్లు కట్టారు. ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్న సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వివిధ దశల్లోని టిడ్కో ఇళ్లను రద్దు చేసింది. మిగిలిన ఇళ్లను నిర్లక్ష్యంగా వదిలేసింది. ఆ తర్వాత పార్టీ రంగులేసింది. కానీ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించలేదు. మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చాకనే లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేరుతోంది. చిత్తూరులో సోమవారం 2,832 మంది సామూహిక గృహ ప్రవేశాలు చేయనున్నారు.
- చిత్తూరు అర్బన్, ఆంధ్రజ్యోతి
టీడీపీ అధికారంలో ఉన్న 2014-19 మధ్యలో పట్టణ మౌళిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ(టిడ్కో) ఆధ్వర్యంలో అర్హులైన లబ్దిదారులకు పూణేపల్లె వద్ద గృహ నిర్మాణాలను చేపట్టింది. ఇందులో 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు రకాల గృహ నిర్మాణాలను ప్రారంభించారు. 300 చదరపు అడుగుల గృహానికి లబ్దిదారుడి వాటా కింద రూ.500 డిపాజిట్ కట్టించుకున్నారు. అలాగే 365 చదరపు అడుగులకు రూ.25వేలు, 430 చదరపు అడుగులకు రూ.50వేలు డిపాజిట్ చేశారు. ఈ మొత్తాలను ముందుగానే లబ్ధిదారుల నుంచి వసూలు చేశారు. ప్రతి యూనిట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ రూ.1.50 లక్షల చొప్పున మొత్తం రూ. 3లక్షలు ఉంటుంది. యూనిట్‌ను బట్టి బ్యాంకు రుణాలు ఉంటాయి.
ఉమ్మడి జిల్లాలో 6288 గృహాల రద్దు
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 17,395 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయి. 2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోగా వైపీపీ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అప్పటికే 64 శాతం పనులు పూర్తయింది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు నిర్మాణపు పనులను కొనసాగించకపోగా... వివిధ దశల్లో ఉన్న 6288 ఇళ్లను రద్దు చేసింది. ఇందులో పునాది లెవల్‌లో, గోడ, పిల్లర్ల స్థాయిల్లో ఉన్న ఇళ్లున్నాయి. ఇలా తిరుపతిలో 1200, చిత్తూరులో 672, మదనపల్లెలో 1056, శ్రీకాళహస్తిలో 1632, పుంగనూరులో 624, పుత్తూరులో 576, నగరిలో 528 గృహాలను రద్దు చేసింది. రద్దు చేసిన గృహాలకు సంబంధించి లబ్ధిదారులకు రూ. 37.82కోట్ల డిపాజిట్లను తిరిగివ్వలేదు. తమ డిపాజిట్లను తిరిగి ఇచ్చేయాలని లబ్ధిదారులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు.
కూటమి వచ్చాక వేగంగా పనులు
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే టిడ్కో గృహాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. అప్పటికే మరమ్మతులకు గురైన నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు మిగిలిపోయిన 36 శాతం పనులను వేగంగా పూర్తి చేసింది. టిడ్కో అధికారులతో పాటు కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కమిషనర్ నరసింహప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో చిత్తూరులో రెండేళ్లలోపే నిర్మాణాలను పూర్తి చేశారు. వీటిలో రూ.500 డిపాజిట్ చేసిన వారికి 2256 గృహాలు, రూ. 25వేలు డిపాజిట్ చేసిన వారికి 240, రూ.50వేలు డిపాజిట్ చేసిన వారికి 336 గృహాలను పంపిణీకి సిద్ధం చేశారు.
మౌలిక సదుపాయాలకు రూ.18.96 కోట్లు
టిడ్కో గృహ సముదాయంలో వంద శాతం మౌళిక సదుపాయాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో కలిపి రూ.18.96 కోట్లను ఖర్చు చేశారు. నీటి సరఫరాకు 2.50 కిలోమీటర్ల పైపులైన్, 1.82 కి .మీ రోడ్డు, 4.40 కి.మీ, డ్రైన్లు, జీఎల్‌ఎ్‌సఆర్ 100 కి.మీ పనులను చేపట్టారు. అలాగే విద్యుత్ పనులకు రూ.3.22 కోట్లు, ఎస్‌టీపీ (1.30 ఎంఎల్‌డీ)కి రూ.4.51 కోట్లు ఖర్చు చేశారు.
నేడు టిడ్కో గృహాల పంపిణీ
దాదాపు పదేళ్ల తరువాత టిడ్కో లబ్దిదారుల కల నెరవేరనుంది. సోమవారం చిత్తూరు సమీపం పూణేపల్లె సమీపంలో నిర్మించిన టిడ్కో గృహాలను కలెక్టర్, స్పెషలాఫీసర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కమిషనర్ నరసింహ ప్రసాద్‌తో పాటు కూటమి పార్టీ నేతలతో కలిసి గృహాలను ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేస్తారు.