22ఏ బాధితుల ఆస్తిహక్కుల పరిక్షరణకు ఉద్యమిస్తాం
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:10 AM
22ఏ బాధితుల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
తిరుపతి అర్బన్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): 22ఏ బాధితుల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. తిరుపతిలోని రాస్ భవనం ఎదురుగా మారుతీ నగర్‌లో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ లిబర్టీ ఆస్తి హక్కుల కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 22ఏ నిషేధిత జాబితా కారణంగా చట్టబద్ధమైన ఆస్తులపై హక్కులను వినియోగించుకోలేక లక్షలాది మంది యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారికి అండగా నిలిచేందుకు సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలి ఆస్తి హక్కుల కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటు చేశామని తెలిపారు. సీతాదేవిని రావణుడు అపహరించి లంకలో దాచినట్టు రైతుల భూ హక్కుల్ని రాత్రికి రాత్రి 22ఏలో దాచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నలమోతు చక్రవర్తి, సుబ్బారెడ్డి, భాస్కర్ నాయుడు, చింతల సుబ్బారాయుడు మాట్లాడుతూ, 22ఏ మూలంగా లక్షలాది మంది అవసరాలకు భూమిని అమ్ముకోలేక నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. ఇదే అదనుగా కొందరు నాయకులు, అధికారులు ప్రజలను పీడించుకొని తింటున్నారని మండిపడ్డారు. అనంతరం పలువురి నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆస్తిహక్కుల కేంద్రం రాయలసీమశాఖ అధ్యక్షుడు శింగిరిబాబు, కార్యదర్శి ఎన్‌పీ సురేష్, న్యాయవాది ఎం.సిద్ధారెడ్డి, మీరయ్య, అమూల్ నాయుడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.