61 పోస్టులకు 200 మంది ఎస్‌ఏలు హాజరు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:20 AM
స్కూల్ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది.
చిత్తూరు సెంట్రల్, జూలై 2(ఆంధ్రజ్యోతి): హైస్కూల్ ప్లస్ పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లుగా పదోన్నతికి కోసం గురువారం డీఈవో కార్యాలయంలో చేపట్టిన స్కూల్ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. సబ్జెక్టుల వారిగా ఖాళీలను పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ల (పీజీటీ) హోదాలో భర్తీ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు విద్యార్హతలు కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు అవకాశం కల్పించారు. ఈక్రమంలో గురువారం డీఈవో కార్యాలయంలో జరిగిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు 61 పోస్టులకు గాను దాదాపు 200 మందికి పైగా ఎస్‌ఏలు వచ్చారు. వీరి సంఖ్యకు అనుగుణంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అధికారులను నియమించలేదు. దీంతో వెరిఫికేషన్ సజావుగా జరిగిందా?లేదా? అని టీచర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటం,పెద్ద సంఖ్యలో టీచర్లు రావడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇబ్బందులెదురయ్యాయని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సీనియారిటీ ఆధారంగా శుక్రవారం జరిగే పీజీటీల కౌన్సెలింగ్‌లోనైనా జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లు అభ్యంతరాలు ఉంటే శుక్రవారం ఉదయం 11 గంటలలోపు లిఖిత పూర్వకంగా తెలియజేయాలని, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లు ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు.