తిరుపతి డిప్యూటీ మేయర్ రేసులో 20 మంది
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:16 AM
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని భారీ మెజారిటీతో గెలుచుకున్న కూటమిలో ఇపుడు డిప్యూటీ మేయర్ పదవి కోసం పోరు మొదలైంది.
తిరుపతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 66 డివిజన్లలో 59 స్థానాలతో పాటు మేయర్ పదవిని కూడా భారీ మెజారిటీతో గెలుచుకున్న కూటమిలో ఇపుడు డిప్యూటీ మేయర్ పదవి కోసం పోరు మొదలైంది. వైసీపీ ప్రభుత్వ విధానానికి భిన్నంగా ఇపుడు ఒకే డిప్యూటీ మేయర్ పదవి వుండడంతో పోటీ తీవ్రమైంది. కూటమిలో జనసేన, బీజేపీ నుంచీ ఏకంగా 20 మంది ఆశావహులు రేసులో వుండడం విశేషం. దీంతో అసలు ఎన్నికలకు మించిన హడావిడి, అంతర్గత అలజడి ఈ పరోక్ష ఎన్నికల్లో కనిపిస్తోంది. ఈనెల 23న డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుండగా ఆ లోపు తమ అవకాశాలను మెరుగుపరుచుకుని పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు తీవ్రంగా యత్నిస్తున్నారు. మేయర్ పదవి టీడీపీకి దక్కినందున డిప్యూటీ మేయర్ పదవికి ఆ పార్టీ రేసులో లేదు. కూటమిలో ఆ పదవిని జనసేన లేదా బీజేపీకి కేటాయించనున్నారు. మేయర్ జేబీ శ్రీనివాస్ బలిజ సామాజికవర్గం కాబట్టి డిప్యూటీ మేయర్ పదవి మళ్ళీ అదే వర్గానికి కేటాయించే అవకాశాలు దాదాపు లేవు. రెడ్డి, కమ్మ, బీసీ వర్గాలలో ఒకరికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.
జనసేనలో గెలిచిన 19 మందీ ఆశావహులే!
జనసేన పార్టీకి కూటమి సర్దుబాట్లలో భాగంగా 22 డివిజన్లు కేటాయించారు. అందులో ఆ పార్టీ అభ్యర్థులు 19 చోట్ల గెలిచారు. కార్పొరేటర్లుగా ఎన్నికైన వారంతా తొలిసారి గెలిచిన వారే. ఈ కారణంగా సీనియారిటీ, అనుభవం వంటివి ప్రాతిపదిక కాకపోవడంతో కార్పొరేటర్లు అందరూ తామేం తక్కువ కాదంటూ డిప్యూటీ మేయర్ పదవిని కోరుతున్నారు. అందరూ ఆశావహులే అయినప్పటికీ ప్రత్యేకించి కొన్ని సమీకరణల కారణంగా కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 58వ డివిజన్ నుంచీ కార్పొరేటర్‌గా గెలిచిన నగర పార్టీ అధ్యక్షుడు జగదీష్ రాజారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తొలినుంచీ పార్టీలో కొనసాగుతుండడం, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి శ్రమించడం, వీటన్నింటికీ మించి పల్లిరెడ్డి బీసీ సామాజికవర్గానికి చెందిన వారు కావడం ఆయనకు సానుకూలతలుగా మారుతున్నాయి. జిల్లాలో ఈ సామాజికవర్గం గణనీయంగా వుండడంతో పాటు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మద్దతు ఇతడి అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తోంది. కాగా 35వ డివిజన్ నుంచీ గెలిచిన గేట్ విద్యా సంస్థ యజమాని వెంకటేశ్వర్లు సతీమణి విజయ పేరు కూడా అధిష్ఠానం పరిశీలనలో వున్నట్టు ప్రచారమవుతోంది. కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చేటట్టయితే ఈమెకు ఎమ్మెల్యే మద్దతు కూడా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 18వ డివిజన్ నుంచీ గెలుపొందిన పార్టీ జిల్లా సమన్వయకర్త కిరణ్ రాయల్ ప్రధాన అనుచరుడు మనోజ్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు. ఎస్సీలకు డిప్యూటీ మేయర్ కేటాయించాలనే డిమాండ్‌తో కిరణ్ రాయల్ ఇతడిని రేసులో నిలిపారు. మరోవైపు మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ నేత ఎస్‌కే బాబు కోడలు షాహినా 20వ డివిజన్ నుంచీ గెలిచారు. బాబు మైనారిటీ కోటా కింద తన కోడలికి అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి కేటాయించే పక్షంలో ఈ నలుగురిలోనే ఒకరికి అవకాశం దక్కుతుందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది.
బీజేపీ నుంచీ ఏకైక పేరు పృధ్వీరెడ్డి
కూటమికి సంబంధించి తిరుపతిలో ఎమ్మెల్యే పదవిని జనసేనకు, మేయర్ పదవిని టీడీపీకి కేటాయించగా బీజేపీకి మాత్రం ఇంకా తగిన ప్రాతినిధ్యం లేదు. దీన్ని బలంగా ఎత్తిచూపుతున్న ఆ పార్టీ నేతలు ఇపుడు డిప్యూటీ మేయర్ పదవిని బీజేపీకే కేటాయించాలని కోరుతున్నారు.డిప్యూటీ మేయర్ పదవిని బీజేపీకి కేటాయించే పక్షంలో నిస్సందేహంగా ఆ అవకాశం 52వ డివిజన్ నుంచీ గెలిచిన పృధ్వీరెడ్డికి దక్కనుంది. బీజేపీ నుంచీ గెలిచిన ముగ్గరిలో మిగిలిన ఇద్దరు కూడా పృధ్వీరెడ్డికి మద్దతు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీలో సీనియర్ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి కొడుకు కావడం ఇతడికి అదనపు బలంగా మారింది.మొత్తమ్మీద డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగే రోజు సమీపిస్తుండడంతో ఆశావహులు ఎవరికి వారు తమకు వీలైన మార్గాల్లో పదవి కోసం జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.