భాకరాపేటలో ఏపీఐఐసీకి 19.62 ఎకరాల భూమి కేటాయింపు
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:22 AM
చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలోని ఎల్‌పీఎం నంబరు 440 (పాత సర్వే నంబరు 329-2)లోని 19.62 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి ఉచితంగా ఇచ్చినా.. దీనిని మెస్సర్స్ వైకేఆర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించడానికి అన్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొనడం గందరగోళానికి దారి తీస్తోంది.
రెవెన్యూ నుంచి ఉచితంగా బదలాయింపు
ఆపై దాన్ని వైకేఆర్ ఫుడ్ సంస్థకు ఇవ్వనున్న ఏపీఐఐసీ
గత వైసీపీ ప్రభుత్వంలో ఇదే భూమి కోసం యత్నించిన యాజమాన్యం
తాజాగా భూమి కేటాయించిన ప్రభుత్వం
తిరుపతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలోని ఎల్‌పీఎం నంబరు 440 (పాత సర్వే నంబరు 329-2)లోని 19.62 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి ఉచితంగా ఇచ్చినా.. దీనిని మెస్సర్స్ వైకేఆర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించడానికి అన్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొనడం గందరగోళానికి దారి తీస్తోంది. ఆ సంస్థ సంబంధిత భూమిలో ఇండస్ట్రియల్ పార్కు లేదా ఎంఎ్‌సఎంఈ పార్కు ఏర్పాటు చేసేలా పేర్కొన్నారు. వైకేఆర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుపతికి చెందింది. గత వైసీపీ ప్రభుత్వంలోనూ ఇదే భూముల కోసం ఆ సంస్థ ప్రయత్నించినట్టు సమాచారం. అప్పట్లో ఏ కారణం వల్లనో భూముల కేటాయింపు జరగలేదు. మరోవైపు ఆ సంస్థ ప్రతినిధులు మాజీ మంత్రి రోజాకు సన్నిహితులనే ప్రచారం ఉంది. దీంతో ఈ భూమి కేటాయింపు వ్యవహారం తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల కూటమి పార్టీల వర్గాల్లో గందరగోళం నెలకొంది. వైకేఆర్ సంస్థ ప్రతినిధుల కుటుంబం వైసీపీకి గట్టి సానుభూతిపరులుగా ప్రచారమైంది. అలాంటి సంస్థకు గత వైసీపీ ప్రభుత్వంలోనే దక్కని భూములు ప్రస్తుత ప్రభుత్వంలో దక్కడం పట్ల కూటమి పార్టీల వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా ఏపీఐఐసీకి భూమిని కేటాయించిన తర్వాత ఏపీఐఐసీ దాన్ని అభివృద్ధి చేసి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న ఏ కంపెనీకైనా కేటాయించవచ్చు. అందులో ఎవరికీ అభ్యంతరం కూడా ఉండదు. అయితే ఏపీఐఐసీకి భూమి కేటాయిస్తూ జారీ చేసిన జీవోలోనే వైకేఆర్ సంస్థ ప్రస్తావన కూడా ఉండటంతో ఈ కేటాయింపు వెనుక ఏం జరిగిందన్న చర్చ మొదలైంది.
ఏపీఐఐసీకే ఉచితం.. ప్రైవేటు సంస్థలకు కాదు: కలెక్టర్
భాకరాపేటలో 19.62 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి మాత్రమే ఉచితంగా కేటాయించినట్టు కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. ఆ భూములను ఏపీఐఐసీ చదును చేశాక నిబంధనల ప్రకారం వైకేఆర్ సంస్థకు మార్కెట్ విలువ ఆధారంగా ధర నిర్ణయించి విక్రయిస్తుందన్నారు. అంతే తప్ప ప్రభుత్వ భూమిని వైకేఆర్ ఫుడ్ సంస్థకు ఉచితంగా కేటాయించడం లేదని స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితుల్లో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థ పెట్టే పెట్టుబడి, కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా రాయితీ ధరతో గానీ లేదా ఉచితంగా గానీ భూమి కేటాయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుత అంశంలో వైకేఆర్ సంస్థకు భూమి ఉచితంగా కేటాయించలేదని స్పష్టం చేశారు.